
‘ఇదంతా కేజ్రీవాల్ ఆడించిన నాటకం’
న్యూఢిల్లీ: తనపై దాడి చేసిన అంకిత్ భరద్వాజ్ బీజేపీ కార్యకర్త అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తప్పుడు ప్రచారం చేస్తోందని కేజ్రీవాల్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఆరోపించారు. ఇదంతా కేజ్రీవాల్ ఆడించిన నాటకమని మండిపడ్డారు. తనపై దాడి జరిగిన వెంటనే భరద్వాజ్ బీజేపీ కార్యకర్త అంటూ ఆప్ నేతలు సోషల్ మీడియా అసత్య ప్రచారానికి దిగారని వెల్లడించారు. ఆప్ సీనియర్ నేతల విదేశీ పర్యటనలకు ఖర్చయిన నిధుల వివరాలను బహిర్గతం చేయాలన్న డిమాండ్‌తో నిరాహారదీక్షకు దిగిన మిశ్రాపై బుధవారం భరద్వాజ్ దాడి చేశాడు. దీనిపై సీఎం కేజ్రీవాల్‌కు మిశ్రా లేఖ రాశారు.
‘నాపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు ఫేస్‌బుక్‌లో షేర్ చేయడం, ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే గతంలో మీపై (కేజ్రీవాల్) దాడి జరిగినప్పుడు ఎలా చేశారో అలాగే ఇప్పుడు చేశారు. ఇది పాత ట్రిక్కు. భరద్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోకముందే అతడు బీజేపీ కార్యకర్త అని ఆప్ నేత సంజయ్ సింగ్ ప్రకటించారు. ఇలాంటిది జరుగుతుందని ఆప్ నాయకులకు ముందే తెలుసున’ని లేఖలో మిశ్రా ఆరోపించారు. భరద్వాజ్‌తో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బీజేపీ యువ మోర్చా తెలిపింది.