హస్తినలో దోస్తీ
Published Fri, Jan 24 2014 12:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, చెన్నై: తొమ్మిదేళ్లుగా సాగిన డీఎంకే, కాంగ్రెస్ బంధానికి గత ఏడాది బ్రేక్ పడింది. తమ బంధం గట్టిదంటూ పదే పదే చెప్పుకొచ్చే కరుణానిధి ఈలం తమిళుల సంక్షేమం నినాదంతో యూపీఏ నుంచి బయటకు వచ్చారు. తన వారిని మంత్రి పదవులకు రాజీనా మా చేయించారు. తన స్వరాన్ని పెంచి కేంద్రంపై విరుచుకు పడ్డారు. బయట నోరు పారేసుకుంటున్నా, లోక్‌సభ, రాజ్య సభల్లో మాత్రం యూపీఏ కొత్త నిర్ణయాలకు మద్దతు పలుకుతూనే వచ్చారు. కనిమొళిని మళ్లీ ఎంపీ చేయ డం లక్ష్యంగా కాంగ్రెస్ తలుపు తట్టారు. ఇవన్నీ జగమెరిగిన సత్యం. అయితే, తాజాగా డీఎంకే సాగిస్తున్న రాజకీయం రక్తికట్టిస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తే లేదం టూ పార్టీ సర్వ సభ్య సమావేశంలో తేల్చిన కరుణానిధి, లోలోపల కాంగ్రెస్ తో చెలిమికి తహతహలాడుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కోసం గోపాల పురం తలుపులు తెరచుకోవడం, కాంగ్రెస్ సీనియర్లు అరివాళయం వర్గాలతో భేటీలు అవడం జరుగుతూనే ఉన్నాయి. చెన్నైలో ఉన్న కరుణానిధి పదే పదే కాంగ్రెస్‌తో మళ్లీ పొత్తా? నో ఛాన్స్! అంటూనే, ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రితో మంతనాలు నెరుపుతున్నారు. సోనియాతో కనిమొళి భేటీ: డీఎంకే పార్లమెంటరీ నేత టీ ఆర్ బాలు ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో టచ్‌లో ఉన్న విష యం తెలిసిందే. తాజాగా కరుణానిధి గారాల పట్టి కనిమొళి సోనియాతో భేటీ కావడం వెలుగులోకి వచ్చింది. రాజ్య సభతో పాటుగా, లోక్‌సభ ఎన్నికల చెలిమికి సంబంధించి కరుణానిధి పం పిన సందేశాన్ని సోనియా దృష్టికి కనిమొళి తీసుకెళ్లినట్టు సమాచారం. తమ అభ్యర్థి తిరుచ్చి శివ గెలుపునకు సహకరించాలంటూ చేసిన విజ్ఞప్తికి సోనియా అంగీకరించినట్టు తెలిసింది. ఈ వ్యవహారాలు బయటకు పొక్కనప్పటీకీ ఢిల్లీ ఏఐసీసీ వర్గాల ద్వారా మీడి యా చెంతకు చేరడంతో చాప కింద నీరులా సాగుతున్న డీఎంకే, కాంగ్రెస్ చెలిమి వ్యవహారంపై చర్చ మొదలైంది.
వాసన్‌కు పగ్గాలు: రాష్ట్రంలో డీఎంకేతో కలసి పనిచేయాలన్నా, కరుణానిధి రాజకీయాన్ని తట్టుకోవాలన్నా, అం దుకు తగ్గ సమర్థవంతుడైన నాయకుడు పార్టీ పగ్గాలు చేపట్టాలన్న నిర్ణయానికి ఏఐసీసీ వచ్చినట్టు సమాచారం. కేంద్ర నౌకాయన శాఖ మంత్రి జీకే వాసన్ రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రధాన గ్రూపు నేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన వర్గానికి చెందిన జ్ఞాన దేశికన్ టీఎన్‌సీసీ అధ్యక్షుడు. డీఎంకే రాజకీయాల్ని తట్టుకునే శక్తి జ్ఞానదేశికన్‌కు లేదు. రాష్ట్రంలో పార్టీ పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాలంటే వాసన్ ద్వారానే సాధ్యమని సోనియా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల వేళ రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించేందుకు వాసన్‌ను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. రాష్ర్ట పార్టీ పగ్గాల్ని వాసన్‌కు అప్పగించడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని పడేయడానికి వ్యూహ రచన చేస్తున్నారు. వాసన్‌కు డీఎంకేతో సంబంధాలు ఉండటం, రాష్ట్ర పార్టీలోని గ్రూపుల్ని కలుపుకుని వెళ్లే తత్వం ఉన్న దృష్ట్యా, రెండు రకాలుగా ఎన్నికల వేళ లబ్ధి పొందొచ్చన్న అభిప్రాయంతో ఏఐసీసీ పావులు కదుపుతోంది. వాసన్ రాజ్య సభ పదవీ కాలం ముగియనుండడం, ప్రత్యక్ష ఎన్నికలతో లోక్ సభకు వెళ్లేందుకు ఆయన సిద్ధం అవుతున్నారు. త్వరలో పార్టీ పగ్గాలను ఆయనకు అప్పగిస్తారని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
Advertisement
Advertisement