కేసీఆర్ దేవదూత: కేకే
న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ను తాను దేవదూతగా భావిస్తానని టీఆర్‌ఎస్ ఎంపీ కె. కేశవరావు అన్నారు. ఆనాడు దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ ఏవిధంగా అయితే సత్యాగ్రహం చేశారో అదే విధంగా తెలంగాణ కోసం కేసీఆర్ కూడా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన దీక్షా దివస్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీలు డి.శ్రీనివాస్, కవిత, జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య, కెప్టెన్ లక్ష్మీకాంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.