ఢిల్లీలో శాంతిభద్రతల రక్షణ కోసం ప్రజలు, న్యాయాధికర సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో శాంతిభద్రతల రక్షణ కోసం ప్రజలు, న్యాయాధికర సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తద్వారానే నేరాలను అదుపు చేయగలమని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇటీవల ఢిల్లీలో అత్యాచారానికి గురైన 13ఏళ్ల బాలికను ఎయిమ్స్‌లో గురువారం కేజ్రీవాల్ పరామర్శించారు. ఆమె కుటుంబసభ్యులను అడిగి జరిగిన దారుణాన్ని తెలుసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలీవాల్ కూడా నిన్న బాధితురాలిని పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి పుల్ ప్రహ్లాద్పూర్ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.
కాగా ఢిల్లీలోని పుల్ ప్రహ్లాద్‌పూర్ ప్రాంతంలో పదిరోజుల క్రితం పదమూడేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణమైన అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం జరిపి అనంతరం ఆమెను రైల్వే ట్రాక్ సమీపంలో పడేశారు. మానసిక స్థితి సరిగా లేని ఆ బాలిక ఈ నెల 17వ తేదీన కనిపించకుండా పోయింది. ఆమె కోసం గాలింపు జరిపినప్పటికీ ఆచూకీ దొరకలేదు. తర్వాత రోజు రైల్వే ట్రాక్ సమీపంలో ఆ బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఎయిమ్స్‌కు తరలించారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్నారు.