ఖుదాబక్ష్ లైబ్రరీ పేరెత్తని బుక్‌ఫేయిర్
Published Sat, Aug 31 2013 1:15 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
న్యూఢిల్లీ: ఖుదాబక్ష్ గ్రంథాలయం పేరు దేశదేశాల విద్యాపారంగంధులకు, మేధావులకు చిరపరిచితం. ఖుదాబక్ష్ గ్రంథాలయం విజ్ఞాన నిధిగా, గనిగా ప్రపంచవ్యాప్తంగా వాసికెక్కినా ఢిల్లీ పుస్తక ప్రదర్శన నిర్వహకుల కంటికి ఆనలేదు. ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 19వ వార్షిక ఢిల్లీ పుస్తక ప్రదర్శనకు దేశ విదేశాలకు చెందిన ప్రచురణకర్తలను, దేశంలోని చిన్నా పెద్ద గ్రంథాలయాలను ఆహ్వానించి స్టాల్స్ పెట్టించిన నిర్వహకులు ఖుదాబక్ష్ గ్రంథాలయాన్ని మాత్రం విస్మరించారు. ‘‘గ్రంథాలయాలు-పాఠకులు’ నేపథ్యంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో గ్రంథాలయాల్లో మేటిగా పేరున్న ఈ గ్రంథాలయాన్ని విస్మరించడం పట్ల పలువురు మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనేక అరుదైన రాత ప్రతులను సంరక్షించి వర్తమాన, భావితరాల అధ్యయన, పరిశోధనలకు దోహదపడుతున్న ఖుదాబక్ష్ గ్రంథాలయం నిర్వాహకులకు గుర్తు రాకపోవడం క్షంతవ్యం కాదన్నారు.
ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ప్రదర్శనలో కొల్‌కటా జాతీయగ్రంథాలయం, ఉత్తరప్రదేశ్ రాంపూర్ రజా గ్రంథాలయం, చివరకు భువనేశ్వర్, హైదరాబాద్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలకు స్థానం కల్పించిన నిర్వాకులు ప్రదర్శన జరుగుతున్న నగరంలోనే ఉన్న లోకప్రసిద్ధ గ్రంథాలయాన్ని విస్మరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఖుదాబక్ష్ గ్రంథాలయాన్ని విస్మరించడం గ్రహపాటో,పొరపాటో, కాదు ఇది దిద్దుకోలేని పెద్ద తప్పదం’’ అని ప్రదర్శనలో పాల్గొంటున్న విపిన్ జట్లీ అన్నారు. ‘‘ప్రదర్శన నిర్వహకులు వివిధ ప్రసిద్ధ గ్రంథాలయాలను గూర్చి పేర్కొంటూ తయారు చేయించిన సూచికల్లోనూ ఈ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఖుదాబక్ష్ గ్రంథాలయాన్ని మౌల్వీ ఖుదాబక్ష్ తన తండ్రి వారసత్వంగా అందిన విజ్ఞాన సంపదను 1891లో బీహార్‌లోని పాట్నాలో గ్రంథాలయంగా ఏర్పాటు చేశారు.
దీనికి ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ ల్రైబ్రరీగా పేరుపెట్టారు. భారత ప్రభుత్వం 1961లో ఈ గ్రంథాలయాన్ని జాతీయ ప్రాధాన్యత గలిగిన సంస్థగా ప్రకటించింది. వేలాది ప్రాచీన లిఖిత ప్రతులు, అత్యంత అరుదైన గ్రంథాలకు నిలవైన ఈ లైబ్రరీ కేంద్రంగా దేశదేశాలకు చెందిన పండితులు, విద్యావేత్తలు తమ పరిశోధనలను సాగించారు. ఇంత ఘన చరిత్ర కలిగిన జ్ఞాన బండాగారానికి సంబంధించిన చరిత్ర కూడా నిర్వహ కులకు గుర్తుండక పోవడం ఇంకా గర్హించదగిన విషయం. ఖుదాబక్ష్ గ్రంథాలయాన్ని 1969లో ఏర్పాటు చేసినట్లుగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన సూచికల్లో ప్రస్తావించారు.
జాతీయ గ్రంథాలయ సంస్థకు ఈ విషయం ఎందుకు తలుపుకు రాలేదనేది అర్థం కాని విషయం. అంతేకాదు అమెరికన్ లైబ్రరీని అమిరికన్ లైబ్రరీగానూ, రాజా రాంమోహన్ రాయ్ గ్రంథాలయాన్ని ఆంగ్లభాషలో అసమాపక అక్షరాలతో రాశారు. ప్రచురణకు వెళ్లే ముందు పరిశీలించుకోవాల్సిన అంశాన్ని కూడా నిర్వహకులు పట్టించుకోలేదు’’ అని జేట్లీ వివరించారు. ఈ విషయంపై నిర్వహకులను ప్రశ్నించగా ‘‘కొన్ని పొరపాట్లు జరిగాయి. సమయాభావం కూడా ఇందుకు కారణమయింది. ఏమైనా ఇది జరగాల్సింది కాదు. చేసిన తప్పుకు క్షమాపణ తెలుపుతున్నాము’’ అన్నారు. గ్రంథాలయాలు, పుస్తకాలను గురించి మాట్లాడాల్సినప్పుడు తప్పనిసరిగా అక్షర దోషాలను పరిహరించాల్సిన అవసరం ఉంది. ఖుదాబక్ష్ మన సాంస్కృతిక వారసత్వ సంపద. జాతీయ జ్ఞాన సంపదకు చిహ్నాం. ఇది మా వైపు నుంచి జరిగిన పెద్ద పొరపాటే’’ అని భారత ప్రచురణకర్తల సమాఖ్య అధ్యక్షులు సుధీర్ మల్హోత్రా అన్నారు.
ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) భారత ప్రచురణకర్తల సమాఖ్య సంయుక్తంగా నిర్వహించారు. నిర్వహకులు మాట్లాడుతూ‘‘మేము దేశంలోని అన్ని ప్రముఖ, ప్రసిద్ధ గ్రంధాలయాలను సంప్రదించాము. ఖుదాబక్ష్ గ్రంథాలయాన్ని కూడా సంప్రదించి వారి వద్దనున్న లిఖిత ప్రతులను ప్రదర్శించాలని కోరాము. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రతిబంధకాల వలన ఇది కార్యరూపం దాల్చలేదు. అయితే గ్రంథాలయాల సూచికల్లో దీని ఫొటోలను ఎందుకు ప్రచురించలేదో కారణం తెలియరాలేదు’’ అని వివరణ ఇచ్చారు.
ఢిల్లీ పుస్తక ప్రదర్శన సంర్భంగా ముంబై లైబ్రరీ ఆఫ్ ఆసియాటిక్ సొసైటీ, కొల్‌కటా నేషనల్ లైబ్రరీ, కొల్‌కటా పబ్లిక్ లైబ్రరీ, కొల్‌కటా ఇంపీరియల్ లైబ్రరీ, రాంపూర్ రజా లైబ్రరీ, బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ, అమెరికన్ లైబ్రరీ, జేఆర్‌డీ టాటా మెమోరియల్ లైబ్రరీ(బెంగళూరు), హైదరాబాద్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇనిస్టిట్యూట్స్, భువనేశ్వర్ హరేకృష్ణ మహతాబ్ స్టేట్ లైబ్రరీ పేర్లను ప్రదర్శించారు. ‘‘ప్రదర్శన ప్రవేశ ద్వారం వద్దనే ఇన్ని గ్రంథాలయాల పేర్లను ప్రదర్శించిన నిర్వహకులు ఖుదాబక్ష్ గ్రంథాలయం పేరును ఏలా మర్చిపోతారు.
ఇది ఖచ్చితంగా సమయం, స్థలానికి సంబంధించిన సమస్య కాదు కేవలం చిత్తశుద్ధికి సంబంధించిన విషయం. విస్మరించాం, పొరపాటైంది అనే మాట చాలా చిన్నది. ఇది పెద్ద తప్పు’’ అని విమర్శించాడు ప్రదర్శనను సందర్శించిన ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి నిషాంత్.
ఖుదాబక్ష్
న్యూఢిల్లీ: ఖుదాబక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ జగత్ప్రసిద్ధమైన గ్రంథాలయం. ఈ గ్రంథాలయాన్ని బ్రిటిష్ ఏలుబడి కాలంలో ఆరుగురు వైస్‌రాయ్‌లు, ఇద్దరు ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌లు సందర్శించారు. భారత రాజకీయ ధురందరులు జాతీపిత మహాత్మా గాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, నలుగురు భారత రాష్ట్రపతులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. వీరందరూ ఈ గ్రంథాలయాన్ని బోడ్‌లియన్ ఆఫ్ ఇండియాగా కీర్తించారు. ఈ గ్రంథాలయంలో 21,000 లిఖిత గ్రంథాల ప్రతులున్నాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంనాటి తారీఖ్-ఈ-కాందాన్-ఈ-తుమరియా కూడా లిఖిత ప్రతిగా ఇక్కడ అందుబాటులో ఉంది. షెహన్షా నామా ఆఫ్ హుస్సేనీలు ఉన్నాయి. 17వ శతాబ్దిలో గ్రంధస్థమైన షాహజహాన్ చక్రవర్తికి చెందిన పాద్షా నామా ఖ్వాజ్వీని వంటి అపురూప గ్రంథాలు కొలువుతీరాయి. అతి ప్రాచీనమైన సంస్కృతంలో రాసి ఉన్న 40 తాళపత్ర గ్రంథాలు కూడా ఇందులో ఉన్నాయి. కొన్ని మిథిలాక్షర రాత పత్రులు ఇక్కడ బధ్రపర్చారు. ఇంకెక్కడా అందుబాటులో లేని ఇంత అపురూపమైన జ్ఞాన సంపదకు నెలవైన ఖుదాబక్ష్ గ్రంథాలయం వెల కట్టలేని జాతీ సాంస్కృతిక వారసత్వ సంపదకు నిలయం
Advertisement