
తమిళనాడు : నటులు కమలహాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని సీనియర్ నటి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకురాలు కుష్బు వ్యాఖ్యానించారు. ఆమె ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీలో తన స్థానం, తదుపరి తాను తీసుకునే నిర్ణయం వంటి పలు అంశాలపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా రజనీకాంత్, కమలహాసన్‌ల రాజకీయరంగప్రవేశం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం గురించి మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా? అన్నది వేచి చూడాలన్నారు. నటుడు కమలహాసన్ మాత్రం రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారని, అయితే ఈ విషయమై ఆయన దృఢనిశ్చయంతో ఉన్నారా? అన్నదానిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆధారపడి ఉంటుందన్నారు.
అయితే ఈ ఇద్దరికీ ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారని, మరి ఆ అభిమానం అంతా ఓట్లుగా మారుతుందా? అన్నది వేచిచూడాలన్నారు. తానైతే రజనీకాంత్, కమలహాసన్‌లను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని అన్నారు. వారు రాజకీయాల్లోకి వస్తే మీరు వారితో చేరతారా అన్న ప్రశ్నకు.. ఎప్పటికీ తాను వారితో చేరేది లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, ఒక వేళ ఈ పార్టీని వదలాల్సి వస్తే రాజకీయాలనుంచే తప్పకుంటానని కుష్బు తెలిపారు.