
పోలీసులపై కత్తులతో దాడి
టీ.నగర్ (చెన్నై): పోలీసులపై దుండగులు కత్తులతో దాడిచేసి నిందితుడిని విడిపించుకుపోయిన సంఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో శనివారం జరిగింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. తిరునెల్వేలి జిల్లా, నాంగునేరి సమీపంలోని మంజకుళం చెరువులో స్థానికులు మట్టిని తవ్వుతున్నారు. అదే చెరువులో వారికి సమీపంలో మరుకాలకురిచ్చి గ్రామానికి చెందిన మరికొందరు మట్టిని తవ్వుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో మంజకుళానికి చెందిన ఆరుముగం అనే వ్యక్తికి మరుకాలకురిచ్చి గ్రామస్తులకు మధ్య తగాదా ఏర్పడింది. అనంతరం మరుకాలకురిచ్చి గ్రామస్తులు ఆరుముగం కోసం గాలించారు. అతను కనిపించకపోవడంతో ఆయన అన్న సుడలైకన్ను ఇంటికి వెళ్లి ఇంటిని ధ్వంసంచేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో మరుకాలకురిచ్చి గ్రామానికి చెందిన ఉదయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళుతున్నారు. ఆ సమయంలో ఓ ముఠా పోలీసు వాహనాన్ని అటకాయించి వారిపై కత్తులతో దాడిచేసి ఉదయకుమార్‌ను విడిపించుకెళ్లింది.
దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారు అక్కడికొచ్చి గాయపడిన వారిని చికిత్సకోసం నెల్‌లై ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అనంతరం నాంగునేతి ప్రాంతంలో పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. ఇదిలా ఉండగా నిందితుడిని విడిపించుకెళ్లిన వారికోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.