అంచనాలు.. మూడింతలు | komarambheem project Expenditure | Sakshi
Sakshi News home page

అంచనాలు.. మూడింతలు

Published Tue, Sep 27 2016 11:21 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

komarambheem project Expenditure

భారీగా పెరిగిన కొమురంభీం ప్రాజెక్టు వ్యయం
రూ.882.36 కోట్లకు పరిపాలన అనుమతులు  
మూడోసారి అంచనాలను సవరిస్తూ జీవో 801 జారీ
 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ‘కోట్లంటే బిస్కిట్లు అనుకుంటున్నారా.? దస్, బీస్, పచాస్.. సౌ.. కోట్లకు కోట్లు.. పెంచుకుంటూ పోతే ఎలా..?’ సాగునీటి ప్రాజెక్టు పనుల ప్రగతిపై ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆ శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. మంత్రి వ్యాఖ్యలకు తగ్గట్టుగానే జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా కొమురంభీం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని నీటి పారుదల శాఖ అధికారులు ఏకంగా మూడింతలు పెంచేశారు. ముచ్చటగా మూడోసారి ఈ అంచనాలను సవరించడం గమనార్హం. 45,500 ఎకరాలకు సాగు నీరందించేందుకు పెద్దవాగుపై చేపట్టిన ఈ ప్రాజెక్టును రూ.274.14 కోట్లతో పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు డ్యాం నిర్మాణం పూర్తిచేశారు. స్పిల్‌వే, సర్‌ప్లస్ కోర్సును నిర్మించారు. 34.06 కిలోమీటర్ల ఎడమ కాలువ నిర్మాణం, 32 కిలోమీటర్ల మేరకు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుతానికి సుమారు 9,500 ఎకరాలకు సాగు నీరందుతోంది. మిగిలిన 36 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ఈ ప్రాజెక్టు పనుల అంచనాలు సవరించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.902.20 కోట్లకు అంచనాలను పెంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రూ.882.36 కోట్లకు పరిపాలన అనుమతులిస్తూ శుక్రవారం (ఈనెల 23న) జీవో నెం.801ను జారీ చేసింది.
 
పూర్తి చేయాల్సిన పనులివే..
ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాలువ నిర్మాణ పనులు పూర్తికావాల్సి ఉంది. 65 కిలోమీటర్ల పొడవైన ఎడమ కాలువ నిర్మాణం సగం మాత్రమే పూర్తయ్యింది. ఇంకా 30.94 కి.మీలు నిర్మించాల్సి ఉంది. అలాగే ఏడు కి.మీల కుడి కాలువ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. సుమారు 27.81 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ ఏడాది చివరి వరకు ఈ పనులు పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ భావిస్తోంది.
 
భూసేకరణ..
ఈ పనులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కుడి కాలువ, కోర్సిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కుడి కాలువ, డిస్ట్రిబ్యూటరీలు.. వీటి కోసం సుమారు 655 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి రైల్వే లైన్లు దాటాల్సి ఉంది. అలాగే ముంపు గ్రామాల్లోని సుమారు వంద కుటుంబాలకు పునరావాస చర్యలు చేపట్టాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement