ఎల్జీ తీరు ఘోరం..
ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టులో సవాలుచేసిన ఆప్
లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం
అప్రజాస్వామికమని పిటిషన్
ఎమ్మెల్యేల బేరసారాలకు
అవకాశమిచ్చినట్లేనని వాదన
బీజేపీ తీరుపైనా విమర్శలు
కేసులు నీరుగార్చేందుకే
ఈ నిర్ణయమని ఆరోపణ
సాక్షి, న్యూఢిల్లీ:
అసెంబ్లీని రద్దు చేయకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆప్‌కు చెందిన అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గం రాజీనామా అనంతరం రాష్ట్రపతి పాలన విధించడం, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపించకపోవడం అప్రజాస్వామికమని ఆప్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఢిల్లీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం లేదు కనుక అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు జరిపించాలని పిటిషన్‌లో కోరింది.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను విధించాలని కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం పిటిషన్ దాఖలు చేసిందని ప్రముఖ న్యాయవాది, ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ తెలిపారు. రాష్ట్రపతిపాలన విధించడమంటే ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పలు కేసులపై కొనసాగుతోన్న దర్యాప్తులను ప్రభావితం చేయడం కోసం కేంద్రం రాష్ట్రపతిపాలన విధించాలన్న నిర్ణయానికి వచ్చిందని ఆయన ఆరోపించారు. కామన్వెల్త్ క్రీడలు, జల్ బోర్డులతో పాటు గ్యాస్ ధర పెంపు వంటి అంశాలపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైన నేపథ్యంలో దర్యాప్తును ప్రభావితం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోందని భూషణ్ ఆరోపించారు.
జన్‌లోక్‌పాల్ బిల్లును విధాన సభలో ప్రవేశపెట్టేందుకు సరిపడా సభ్యుల మద్దతు సంపాదించడంలో విఫలమైన కేజ్రీవాల్ సర్కార్ ఆ వెంటనే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేయగల స్థితిలో లేమని ప్రకటించిన భారతీయ జనతాపార్టీ కూడా తాజాగా ఎన్నికలు జరపాలని,అసెంబ్లీని రద్దు చేయాలని కోరకపోవడం గమనార్హమని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వారు సంతోషించి ఎన్నికలు వాయిదా వేయడానికి మద్దతు ఇచ్చారని, అందుకే ప్రజల ప్రజాస్వామిక హక్కులను గౌరవించడం కోసం ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటు కావడం కోసం తాము అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రశాంత్ భూషణ్ చెప్పారు. జన్‌లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టలేకపోవడంతో తన మంత్రివర్గంతో పాటు రాజీనామా సమర్పించిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో విధానసభను రద్దుచేసి ఎన్నికలు జరిపించాలని సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అతడి సిఫారసును పట్టించుకోలేదు, అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచాలని నిర్ణయించారు. అంటే ఇతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశానికి ఆయన తలుపులు తెరిచి ఉంచినట్లేనని ఆప్ విమర్శించింది. విధానసభను సుప్తచేతనావస్థలో ఉంచడం వల్ల ఎమ్మెల్యేల బేరసారాలు జరిగే ప్రమాదముందని ఆప్ వాదిస్తోంది.
విద్యుత్ టారిఫ్ పెంపుపై పిటిషన్..
డిస్కంలు విద్యుత్ చార్జీలను పెంచుకునేందుకు డీఈఆర్‌సీ ఇచ్చిన అనుమతిపై హైకోర్టులో దాఖ లైన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. ఆమ్‌ఆద్మీపార్టీ వ్యవస్థాపక సభ్యుడు మధురేష్ లఖైయార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నగరంలో విద్యుత్ పంపిణీ చేస్తున్న రిలయన్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ ఫర్మ్స్, బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్‌లకు విద్యుత్ కొనుగోలు ధర సర్దుబాటు చార్జీ (పీపీఏసీ) కిందధరలను వరుసగా 6,8,7 శాతం పెంచుకునేందుకు డీఈఆర్‌సీ గత ఏడాది జూలై 31న అనుమతినిచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మధురేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. డిస్కంలతో డీఈఆర్‌సీ కుమ్మక్కై పీపీఏసీ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. దీనిపై ఆ సంస్థ ఎటువంటి ప్రజాసభలను నిర్వహించలేదన్నారు.