ఆప్ 'అసెంబ్లీ రద్దు' పిటిషన్ స్వీకరించిన సుప్రీం
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం ఆ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి లోక్సభ ఎన్నికలతో పాటు ఆ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని ఆప్ తన పిటిషన్లో పేర్కొంది. కేవలం సీఎం పదవి చేపట్టిన 49 రోజులకే కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఏర్పాటుకు న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సిఫార్సు చేశారు.
దాంతో ఢిల్లీ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాంతో హస్తినలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అయితే న్యూఢిల్లీ శాసనసభను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆప్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సారి న్యూఢిల్లీ శాసనసభకు జరిగే ఎన్నికలలో తమకు అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటామని ఆప్ భావిస్తుంది.
గతేడాది డిసెంబర్లో ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలలో బీజేపీ (32), అరవింద్ కేజ్రీవాల కన్వీనర్గా గల ఆమ్ ఆద్మీ పార్టీ (28), కాంగ్రెస్ పార్టీ (7) సీట్లు గెలుచుకుంది. అయితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిరాకరించింది. దాంతో న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆప్ను ఆహ్వనించారు. దాంతో కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తదానంతరం న్యూఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దాంతో ఆప్ ప్రభుత్వం ఇంటా బయట పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాంతో కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.