
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న వేళ సంక్షేమ పథకాల్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. వాటి పట్ల వ్యతిరేక వాతావరణాన్ని దేశంలో సృష్టిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఉచితాలపై మాజీ బీజేపీ నేత పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంలో ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. సంక్షేమ కార్యక్రమాలను ఉచితాలుగా చూడొద్దని, సమాజంలో సమానత్వం కోసమే ఉచితాలని పేర్కొంది.
ఉచిత విద్యను, కొన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వాలకు నష్టమని పేర్కొంటూ, వీటికి వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తమకు సన్నిహితులైన కొంతమందికి మాత్రం లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటువంటి ద్రోహులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కొన్ని పార్టీలు ప్రజలకు తాయిలాలు ప్రకటించడం దేశాభివృద్ధికి ప్రమాదకరమంటూ ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
విద్యుత్ సవరణ బిల్లు ప్రమాదకరం
విద్యుత్ చట్టానికి కేంద్రం తలపెట్టిన సవరణలు ప్రమాదకరమైనవని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందులు, కొన్ని కంపెనీలకు లాభం చేకూర్చే ఈ సవరణలను విరమించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ సవరణ బిల్లు–2022తో విద్యుత్ సరఫరా, పంపిణీకి సంబంధించి ప్రజల ఇబ్బందులు తీరకపోగా, మరింత పెరుగుతాయని ట్విట్టర్‌లో ఆయన సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. తొందరపడి ఈ బిల్లును తీసుకురావద్దని కేంద్రాన్ని కోరారు.