
మళ్లీ చెక్
పుదుచ్చేరిలో సాగుతున్న ఆధిపత్య చదరంగంలో ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మళ్లీ చెక్ పెట్టారు.
► కిరణ్‌బేడీ తంత్రం
► నారాయణలో ఆగ్రహం
► హిట్లర్ గవర్నర్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో సాగుతున్న ఆధిపత్య చదరంగంలో ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మళ్లీ చెక్ పెట్టారు. వివిధ సంక్షేమ బోర్డుల నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యే నియామకాలకు మోకాలొడ్డారు. అర్హతల మేరకే పదవులు అని ఫైల్‌ను ప్రభుత్వానికి వెనక్కు తిప్పి పంపడం వివాదానికి దారి తీసింది.దీంతో గవర్నర్‌ను హిట్లర్‌గా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ వర్గాలు పోస్టర్లను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు.
పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ మారిన విషయం తెలిసిందే. నిత్యం పాలకులు, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ఏదో ఒక వివాదం సాగుతోంది. నియమ నిబంధనల్ని పాటించడంలో కిరణ్ సాగిస్తున్న దూకుడు పాలకుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. సీఎంగా నారాయణస్వామి అధికా ర పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నామినేటెడ్ ఎమ్మెల్యే నియమకం వరకు వివాదాలే. ఈ రాజకీయ ఆధిపత్య చదరంగంలో పలు సందర్భాల్లో నారాయణ సర్కారుకు కి రణ్ చెక్ పెడుతూనే ఉన్నారు. తాజాగా మరోచెక్ పెట్ట డం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది.
సంతకం నిరాకరణ:
పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు 15 మంది, మిత్ర పక్షం డీఎంకేకు ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు. వీరిలో సీఎంతో పాటు ఆరుగురు మంత్రులుగా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఒకరు, డిప్యూటీగా మరొకరు, విప్, సీఎం ఢిల్లీ ప్రతినిధిగా ఒక్కొక్కరు చొప్పున మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు అదనపు పదవులు ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురు, డీఎంకే ఎమ్మెల్యేలు ఇద్దరికి ఎలాంటి అదనపు పదవులు లేవు.
వీరికి గృహ నిర్మాణ, విద్యుత్ బోర్డులతో పాటుగా పలు సంక్షేమ బోర్డుల్లో అధ్యక్ష పదవుల్ని నామినేటెడ్‌గా అప్పగించేందుకు సీఎం నారాయణస్వామి నిర్ణయించారు. ఈ నామినేటెడ్ ప్రక్రియ అనాధిగా వస్తున్న దృష్ట్యా, మంత్రి వర్గంలో చర్చించి ఆమోద ముద్రేశారు. మంత్రి వర్గం ఆమోదంతో రాజ్‌భవన్‌కు వెళ్లిన ఫైల్‌ను చూసిన కిరణ్ సంతకం పెట్టేందుకు నిరాకరించి ఉండడం గమనార్హం.
ఆయా పదువులకు ఎంపిక కానున్న వారి అర్హతలను పరిశీలించి, ఆ పదవులకు వారు న్యాయం చేకూర్చగలరా, అస్సలు వారు అర్హులేనా అన్నది తేల్చుకున్నానంతరం తదుపరి అడుగులు వేయడానికి కిరణ్ నిర్ణయించి, అందుకు తగ్గ ఆదేశాలను తన అధికారులకు ఇచ్చి ఉన్నారు. తమ ఫైల్ వెనక్కు రావడంతో నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం వర్గాలు అగ్గి మీద బుగ్గిలా రాజ్‌భవన్ వర్గాల మీద మండి పడుతున్నారు. దీంతో ఈ వివాదం మరి కొంత కాలంగా వేడెక్కే రీతిలో రాజుకోవడం ఖాయం. ఈ పరిస్థితుల్లో గురువారం కిరణ్‌బేడీని హిట్లర్‌గా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ వర్గాలు పోస్టర్లు ఏర్పాటు చేయడం గమనించాల్సిన విషయం.