ఢిల్లీని అధికారులకు వదిలేశాడు
అరవింద్‌పై లవ్లీ ఆరోపణాస్త్రాలు
రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఇదంతా
హామీల్ని నెరవేర్చకుండానేఅధికారం నుంచి వైదొలిగారు
ఇలా చేయడం ప్రజల్ని వంచడమే
23న కేజ్రీవాల్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తాం
న్యూఢిల్లీ: తన రాజకీయ స్వప్రయోజనాల కోసం అరవింద్ కేజ్రీవాల్...ఢిల్లీని అధికారులకు వదిలేశాడని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇచ్చిన హామీలన్నీ అలానే పడిఉన్నాయన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, అనధికార కాలనీలను క్రమబద్ధీకరణ తదితర అనేక హామీలు ఎన్నికల సమయంలో ఆప్ ఇచ్చింది. అయితే తన వాగ్దానాలను పూర్తిచేయకుండానే ఆ పార్టీ పారిపోయింది. ఈవిధంగా చేయడం ప్రజలను వంచించడమే.’ అని విమర్శించారు.
‘పోల్ ఖోల్’ పేరిట త మ పార్టీ ఈ నెల 23వ తేదీన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపడుతుందంటూ అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించాడని, కేవలం తన రాజకీయ స్వప్రయోజనాలను సాధించుకునేందుకు జాతీయ రాజధాని నగరాన్ని ఉన్నతాధికారుల దయాదాక్షిణ్యాలకు విడిచిపెట్టాడని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఢిల్లీ శాఖ కూడా త్వరలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందని అర్విందర్‌సింగ్ లవ్లీ స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఈ నెల 23వ తేదీన స్థానిక సెంట్రల్ పార్కు వద్ద సమావేశమవుతారని, అక్కడ 20 అడుగుల కేజ్రీవాల్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారని చెప్పారు. తదుపరి ఎన్నికల్లో లబ్ధి పొందేదిశగా కేజ్రీవాల్ ముందుకు సాగుతున్నాడని, నగరంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ప్రజల ఈతిబాధలను మరింతపెంచేవిగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు.