తెలుగు రాష్ట్రాల్లో హర్తాళ్, పలువురి అరెస్టు | lower impact of bharat bandh in telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో హర్తాళ్, పలువురి అరెస్టు

Published Mon, Nov 28 2016 11:11 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

తెలుగు రాష్ట్రాల్లో హర్తాళ్, పలువురి అరెస్టు - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో హర్తాళ్, పలువురి అరెస్టు

అధిక విలువ కలిగిన నోట్ల రద్దు వల్ల సాధారణ ప్రజలే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారంటూ విపక్షాలు సోమవారం దేశవ్యాప్తంగా హర్తాళ్ కు పిలుపునిచ్చాయి. హర్తాళ్ ద్వారా ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని తెలంగాణ, ఏపీలో హర్తాళ్ కు మద్దతు తెలుపుతున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో హర్తాళ్ ప్రభావం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]
 
శ్రీకాకుళం: తెల్లవారుజామునుంచే జిల్లాలోని ఆర్టీసీ డిపో వద్ద విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు అడ్డుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పదకొండు మందిని అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పాలకొండలో నిరసన ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేత వి.కళావతిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.
 
వైఎస్సార్ జిల్లా: కడప, ప్రొద్దుటూరుల్లోని ఆర్టీసీ డిపోల్లో కాంగ్రెస్, సీపీఐ నేతలు ధర్నాకు దిగారు. బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
 
పశ్చిమగోదావరి: జిల్లాలోని జంగారెడ్డి గూడెం బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీలు ధర్నాకు దిగాయి. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ద్వారకా తిరుమలలో వైఎస్సార్సీపీతో కలిసి వామపక్షాలు బంద్ ను నిర్వహించాయి. ఏలూరులో వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీని నిర్వహించారు. 
 
ప్రకాశం: జిల్లాలోని చీరాలలో వైఎస్సార్సీపీ, వామపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. హర్తాళ్ కు మద్దతుగా కందుకూరులో వైఎస్సార్సీపీ, వామపక్ష ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత బూచేపల్లి శివ ప్రసాద్ ఆధ్వర్యంలో హర్తాళ్ నిర్వహించారు. 
 
తూర్పు గోదావరి: సామర్లకోట స్టేషన్ సెంటర్లో వైఎస్సార్సీపీ హర్తాళ్ ను నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు తోట సుబ్బరాయుడు, ఆవాల లక్మీ నారాయణ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
విశాఖపట్టణం: జిల్లాలోని మునగపాకలో వైఎస్సార్సీపీ నేత బొడ్డేడ ప్రసాద్, మద్దిలపాలెంలో వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. పాయకరావుపేటలో హర్తాళ్ లో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేత ధనిశెట్టి బాబూరావుతో సహా సీపీఎం, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.  అనకాపల్లిలో వైఎస్సార్సీపీ, వామపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
 
నెల్లూరు: కోవూరులో వైఎస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆత్మకూరులో ఆందోళన చేపట్టిన వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
 
కృష్ణా: జిల్లాలోని జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో ముందు వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించారు. జగ్గయ్యపేటలో కార్యకర్తలతో ర్యాలీని నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ నేత సామినేని ఉదయభాను పోలీసులు అరెస్టు చేశారు. నందిగామలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. 
 
చిత్తూరు: తిరుపతిలోని అంబేద్కర్ సర్కిల్  వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే నారాయణ రెడ్డిలు ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు భూమన, నారాయణ రెడ్డిలను అరెస్టు చేశారు. ఆర్టీసీ బస్టాండులో పోలీసులు బందోబస్తు మధ్య అధికారులు బస్సులను నడుపుతున్నారు.
 
మరో వైపు వైఎస్సార్ సీపీ నేత కోనేటి ఆదిములం ఆధ్వర్యంలో నారాయణ వనం హైవేపై కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తున్నారు. వాల్మీకిపురంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆందోళన చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన చేపట్టారు. విద్యాసంస్ధలు, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా మూతపడ్డాయి.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement