బాధ్యత లేదా!
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మరో మారు మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని శుక్రవారం వ్యక్తం చేసింది. మద్యం బానిసల పునరావసం కోసం ప్రకటించిన హెల్ప్‌లైన్ నంబర్లకు స్వయంగా డైల్ చేసిన ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కౌల్ విస్మయానికి గురయ్యారు. ఆ నం బర్లు ప్రస్తుతం అందుబాటులో లేదని వచ్చిన సమాచారంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లల అపహరణల అడ్డుకట్టకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు.
చెన్నైకు చెందిన న్యాయవాది ఇటీవల మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో మద్యం బానిసల సంఖ్య పెరుగుతున్నదని, ఆదాయాన్ని చూస్తున్నారేగానీ, ప్రజారోగ్యం గురించి పట్టించుకోవడం లేదని అందులో వివరించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమ నిబంధనలకు విరుద్దంగా మద్యం దుకాణాలు ఉన్నాయని, మద్యం బానిసలకు పునరావస కల్పన చర్యలు తీసుకోవడం లేదని, మద్యం కారణంగా ఎదురయ్యే నష్టాలు, కష్టాల గురించి అవగాహన కల్పించడం లేదని అందులో వివరించారు. ఇందుకు తగ్గ కమిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించి ఉన్నదని కోర్టు దృష్టికి తెచ్చారు.
దీనిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్ కౌల్, కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ బాలు హాజరై ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇందుకు ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాదులు మద్యం, మత్తు బానిసలకు పునరావాసం కల్పించడం తదితర వాటి కోసం రెండు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసి ఉన్నామని వివరించారు. ఇందులో ఒకటి సహాయం కోసం, మరొకటి వైద్య సేవల కోసం అని పేర్కొన్నారు. అలాగే, 10581 ఓ నంబరు, 104 మరో నంబరు అని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, ఆ నంబర్లు పని చేయడం లేదంటూ పిటిషనర్ కోర్టుకు సూచించారు.
దీంతో ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కోల్ స్వయంగా తన మొబైల్ తీసుకుని ఆ నంబర్లకు డైల్ చే సి విస్మయంలో పడ్డారు. స్పీకర్ ఆన్ చేసి మరీ అటు వైపుగా వచ్చిన ‘ఈ నంబర్ అందుబాటులో లేదు’ అన్న సమాధానాన్ని ప్రభుత్వం తరపు న్యాయవాదులకు విన్పించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ, బాధ్యత లేదా, ఇదేనా పని తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టు ఉత్తర్వుల్ని పట్టించుకోరా..? అని అక్షింతలు వేశారు. ప్రభుత్వ తీరును చూస్తే ఆవేదన కల్గుతున్నదని వాఖ్యానించారు. రెండు వారాల్లోపు కమిటీ ఏర్పాటు పై చర్యలు తీసుకోవాలని, రెండు నెలల్లోపు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తదుపరి నగరంలో పిల్లల అపహరణ కేసును పరిగణలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వీధి పిల్లలు అపహరణకు గురి అవుతుంటే, ఇంత నిర్లక్ష్యమా అని నగర పోలీసు యంత్రాంగానికి తీవ్రంగానే అక్షింతలు వేశారు.