మదురై, కోవైలో మోడీ పర్యటన
Published Tue, Apr 1 2014 4:20 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
సాక్షి, చెన్నై : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటించనున్నారు. మదురై, కోయంబత్తూరు వేదికలుగా బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లలో బీజేపీ కమిటీ నిమగ్నమైంది. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే, ఐజేకే అభ్యర్థుల జాబితా వెలువడింది. అయితే, రెండు స్థానాలకు మినహా తక్కిన ఆరు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో నేతలు దూసుకెళుతున్నారు. డీఎండీకే నేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, ఎండీఎంకే నేత వైగోలు నిర్విరామంగా తమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఆయూ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే పీఎంకే నేత రాందాసు మాత్రం అనారోగ్య కారణాలతో అడపాదడపా ప్రచారానికి వెళుతున్నారు. తమ కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపు పొందడం తథ్యమన్న ధీమా బీజేపీలో నెలకొం ది. అదే సమయంలో తమ అధినాయకులను రాష్ట్రానికి పిలిపించి ప్రచారం చేయించే ఏర్పాట్లలో కమలనాథులు మునిగారు.
మోడీ రాక
ఉత్తరాదిన ప్రచారంలో తమ పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీ బిజీబిజీగా ఉండడంతో ఈ నెల రెండో వారంలో ఆయన బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం పార్టీ నాయకులు మోహన్ రాజులు, శరవణ పెరుమాల్, వానతీ శ్రీనివాసన్‌లతో కమిటీ ఏర్పా టు అయింది. ఈ కమిటీ మోడీతోపాటు సుష్మా స్వరాజ్ తదితర జాతీయ స్థాయి నాయకుల ప్రచార పర్యటనల మీద కసరత్తుల్లో మునిగింది. సోమవారం టీ నగర్‌లోని కమలాలయంలో ఈ కమిటీ సమావేశం అయింది. ప్రధానంగా మోడీ ప్రచార సభల వేదికలపై సమీక్షించారు. నాలుగు చోట్ల వేదికలను ఎంపిక చేసినా, చివరకు మదురై, కోయంబత్తూరులలో మోడీ ప్రచార సభల నిర్వహణకు చర్యలు చేపట్టారు. ఇందు కు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను జాతీయ కమిటీకి పంపించారు. అక్కడి నుంచి ఆమో దం రాగా, మదురై, కోయంబత్తూరులలో ఏర్పాట్లు వేగవంతం చేయనున్నారు.
మోడీ ఈ నెల రెండో వారంలో లేదా, మూడో వారం మొదట్లో ఈ ప్రచార సభల వేదిక నుంచి ప్రసంగించే అవకాశాలు ఉన్నట్టు కమలనాథులు పేర్కొంటున్నారు. రెండు చోట్ల ఒకే రోజు ప్రచారం ఉంటుందని, కూటమి పార్టీల నేతలందరూ ఈ వేదికపై తప్పకుండా ఉంటారని పేర్కొంటున్నారు. సుష్మాస్వరాజ్ తదితర నేతలను ఇక్కడికి పిలిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తమ అధినాయకులు ఇక్కడ ప్రచారం చేపట్టిన పక్షంలో బీజేపీ కూటమికి మరింత బలం చేరడం తథ్యమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ, ఇతర నాయకుల ప్రచార వివరాలను మరి కొద్ది రోజుల్లో ప్రకటిస్తామని కమలనాథులు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement