నాగ్‌పూర్: న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయానిని అవమానించినందుకు నిరసనగా నాగ్‌పూర్ వచ్చిన అమెరికా ప్రతినిధి బృందాన్ని కలవడానికి రాష్ట్ర విధానసభ నిరాకరించింది. దేవయాని కోర్బాడేకి చేసిన అవమానానికి నిరసనగా అమెరికా ప్రతినిధి బృందాన్ని కలవకూడదని బుధవారంనాడు శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. యువజనోత్సవాలకు మహారాష్ట్ర ప్రతినిధి బృందాన్ని ఎంపిక చేయడానికి వచ్చిన ఈ బృందానికి నిరసన తెలపాలని ఎమ్మెల్యే ప్రణీతి షిండే శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు.
అమెరికా ప్రతినిధి బృందం మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌లతో పాటు మంత్రివర్గాన్ని, శాసనసభ సభ్యులను కలవాల్సి ఉంది. దేవయానిని అత్యంత అవమానకరంగా సోదా చేసినందుకు నిరసనగా ఈ బృందాన్ని ఎవ్వరూ కలవరాదని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూతురు, మహారాష్ట్ర శాసనసభ సభ్యురాలు ప్రణీతి షిండే విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనకు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఏకనాథ్ ఖడ్సే మద్దతు తెలిపారు. శాసనమండలి ప్రతిపక్ష నేత వినోద్ తావ్డే, శివసేన సభ్యుడు నీలం ఘోరేలు కూడా తమ నిరసనను నమోదు చేశారు. మండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ ‘దేవయాని భారత విదేశాంగ శాఖలో సేవలందిస్తున్న వారిలో అత్యంత సమర్థురాలైన అధికారిణి అని పేర్కొన్నారు. పాక్ పర్యటన సందర్భంగా తాను దేవయానిని కలిసినట్లు సభకు వివరించారు. శాసనసభ, శాసన మండలుల సంయుక్త నిరసనను కేంద్రానికి తెలపాలని సామాజిక న్యాయశాఖ మంత్రి శివాజీరావ్ మోఘేని కోరారు.