రాష్ట్రానికి భారీగా జౌళి ప్రాజెక్టులు | Maharashtra gets 1331 new textile projects worth Rs 12000 cr | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి భారీగా జౌళి ప్రాజెక్టులు

Published Tue, Mar 4 2014 10:47 PM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM

Maharashtra gets 1331 new textile projects worth Rs 12000 cr

 ముంబై/షోలాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్రానికి రూ. 12 వేల కోట్ల విలువైన 1,331 కొత్త జౌళి ప్రాజెక్టులు వచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్ర జౌళి శాఖ మంత్రి ఆరిఫ్ మహ్మద్ నసీంఖాన్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నూతన జౌళి విధానం కింద ఈ ప్రాజెక్టులొచ్చాయన్నారు. మరికొన్ని ప్రాజెక్టులు త్వరలో రానున్నాయన్నారు. 10 జౌళి ప్రాజెక్టులకు రూ. 51 కోట్ల మేర సబ్సిడీ ఇచ్చామన్నారు. మరో 50 ప్రాజెక్టులకు వడ్డీలో సబ్సిడీ ఇచ్చామన్నారు. ఐదేళ్ల కాలపరిమితిలో దాదాపు రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని చేరగలుగుతామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం కుదేలైనప్పటికీ ఏడాదిన్నర కాలంలో రూ. 12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఈ విషయం తమకు ఎంతో సంతృప్తి కలిగించిందన్నారు. మరికొన్ని ప్రాజెక్టుల ప్రతిపాదనలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. పత్తి పంట పండించే విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే ప్రాజెక్టులకు పది శాతం రాయితీ ఇస్తామన్నారు. మిగతా ప్రాంతాల్లో స్పిన్నింగ్, జిన్నింగ్, ప్రెస్సింగ్, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఏడు శాతం రాయితీ ఇస్తామన్నారు.

 ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండానే బీజేపీ విధానం
 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఎజెండాను బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటో ందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నసీంఖాన్ అన్నారు. వీరి బారి నుంచి దేశ ఐక్యతను కాపాడుకునేందుకు హిందూ-ముస్లింలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం తెలిపారు. స్థానిక సివిల్ ఆస్పత్రి సమీపంలోని షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) స్థలంలో ఉర్దూ భవన నిర్మాణానికి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కలిసి నసీంఖాన్  శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నసీంఖాన్ మాట్లాడుతూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్‌లో రక్తంతో హోలీ సంబరాలు జరుపుకున్నారని, ఆయన దేశానికి ప్రధాని కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ఆయన ప్రధాన మంత్రి పదవి కోసం పగటి కలలు కంటున్నారని, ఆ కలలను సాకారం కాకుండా చూసే బాధ్యత హిందూ-ముస్లింలదేనని పిలుపునిచ్చారు. కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సుశీల్ కుమార్ షిండేని రాష్ట్ర ప్రజలు ఆదరించాల్సి అవసరముందన్నారు. ఆయనను బలపరచడం ఇక్కడి వారందరి కర్తవ్యమన్నారు.

 అంతకుముందు సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ ఉర్దూ మన భాషనేనని,  పాకిస్తాన్ దానిని జాతీయ భాషగా మార్చుకోవడం మనకు గర్వకారణమన్నారు. ఈ ఉర్దూ భవనంలో చదువుకునే వారంతా విజ్ఞానవంతులు కావాలని, వారు మానవతా ధృక్పదంతో యువతరాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శాసన సభ్యులు దిలీప్ మానే, ప్రణతి శిందేలతోపాటు ధర్మ బోసుళే, ప్రకాశ్ మల్‌గుల్‌వార్,  మాజీ మేయర్లు ఉమర్‌ఖాన్ బెరియా, హరీఫ్ శేఖ్, కార్పోరేటర్ తాపిక్ శేఖ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement