వస్త్ర పరిశ్రమకు సింగిల్ విండో క్లియరెన్సులు | New textiles policy in two months: Kavuri Sambasiva Rao | Sakshi
Sakshi News home page

వస్త్ర పరిశ్రమకు సింగిల్ విండో క్లియరెన్సులు

Published Wed, Oct 2 2013 1:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

New textiles policy in two months: Kavuri Sambasiva Rao

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జౌళి పరిశ్రమల స్థాపనకై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న కష్టాలకు తెర పడనుంది. ప్రస్తుతం కంపెనీ ఏర్పాటు చేయాలంటే అటూఇటూగా 50 అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. వీటన్నిటికీ చెక్ పెడుతూ సింగిల్ విండో క్లియరెన్సుల విధానానికి కేంద్ర జౌళి శాఖ శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం సంయుక్త కార్యదర్శి స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. మంగళవారమిక్కడ ఫిక్కీ సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చికల్లా సింగిల్ విండో సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్స్‌టైల్ పాలసీ ఒకట్రెండు నెలల్లో కార్యరూపం దాలుస్తుందని పేర్కొన్నారు. జౌళి పరిశ్రమకు ఇచ్చే రాయితీలు, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఫండ్ తదితర అంశాల విషయంలో పాలసీ స్పష్టతనిస్తుందని అన్నారు. ‘టఫ్’ పథకాన్ని 2017 వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రూ.11,950 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ నెల 9లోగా నోటిఫికేషన్ విడుదలవుతుందని వివరించారు.
 
 50 శాతం నిధులిస్తాం: పారిశ్రామికవేత్తలు తమకు ప్రభుత్వం నుంచి ఏం కావాలో డిమాండ్లతోపాటే పరిష్కారాలు కూడా చూపాలని సాంబశివరావు సూచించారు. పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరుస్తుందని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement