రెడీమేడ్ దుస్తుల రంగంలోకి ఎన్‌టీసీ | NTC all set to launch its brand | Sakshi
Sakshi News home page

రెడీమేడ్ దుస్తుల రంగంలోకి ఎన్‌టీసీ

Published Thu, Oct 3 2013 2:11 AM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM

రెడీమేడ్ దుస్తుల రంగంలోకి ఎన్‌టీసీ - Sakshi

రెడీమేడ్ దుస్తుల రంగంలోకి ఎన్‌టీసీ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జౌళి రంగంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ (ఎన్‌టీసీ) ‘ఇండియన్ రిపబ్లిక్’ బ్రాండ్ పేరుతో పురుషుల రెడీమేడ్ దుస్తుల రంగంలోకి ప్రవేశించింది. జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, పర్యాటక శాఖ మంత్రి కె.చిరంజీవి చేతుల మీదుగా బుధవారమిక్కడ లోగోను ఆవిష్కరించింది. దుస్తుల ధరలు రూ.399-1,499 మధ్య ఉంటాయని ఎన్‌టీసీ డెరైక్టర్(హెచ్‌ఆర్) రాకేశ్ కుమార్ సిన్హా ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఆరు నెలల్లో మహిళల రెడీమేడ్ దుస్తులను మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పారు. సొంతంగా అలాగే ఫ్రాంచైజీ విధానంలో 300 ఇండియన్ రిపబ్లిక్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను రెండేళ్లలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 36 దాకా ఉంటాయన్నారు. బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తుల మార్కెట్‌లో మూడేళ్లలో 10 శాతం వాటా దక్కించుకుంటామని కంపెనీ మార్కెటింగ్ డెరైక్టర్ అలోక్ బెనర్జీ వెల్లడించారు. ఎన్‌టీసీకి దేశవ్యాప్తంగా 24 మిల్లులున్నాయి.
 
 మూడు ప్లాంట్లు..: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు ఎన్‌టీసీ వెల్లడించింది. స్పిన్నింగ్, వీవింగ్ కోసం రూ.500 కోట్లతో భారీ ప్లాంటును నెలకొల్పనుం ది. 25 ఎకరాల్లో ఏడాదిలో ఇది సాకారం అవుతుందని కంపెనీ విశ్వసిస్తోంది. గుంటూరు, పశ్చిమ గోదావరి లేదా నెల్లూరులో ఇది రానుంది. అలాగే టెక్నికల్ టెక్స్‌టైల్, రెడీమేడ్ దుస్తుల తయారీ కోసం వేర్వేరు ప్లాంట్లను స్థాపించనుంది. వీటి కోసం సుమారు 350 కోట్లు వెచ్చించనుంది. మూడు ప్లాంట్లలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో(పీపీపీ) ఎన్‌టీసీ 12 టెక్నికల్ టెక్స్‌టైల్ ప్లాంట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ.3 వేల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్శించే పనిలో నిమగ్నమయ్యామని కావూరి తెలిపారు. ఇక్కడ 4 టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement