నేపాల్‌లోని హిమాలయన్ రాష్ట్రంలో సంభవించిన భూకంపంలో మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు గాయపడలేదని...
- నేపాల్‌లోని రాష్ట్ర పర్యాటకులు అందరూ సురక్షితమన్న ప్రభుత్వం
- సత్వర సహాయం అందించాలని అధికారులకు సీఎం ఆదేశం
ముంబై: నేపాల్‌లోని హిమాలయన్ రాష్ట్రంలో సంభవించిన భూకంపంలో మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు గాయపడలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. అక్కడికి వెళ్లిన పర్యాటకుల వివరాలు పూర్తిగా తెలియరాలేదని, దాదాపు 50-60 మంది వరకు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. నేపాల్‌లోని రాష్ట్ర పర్యాటకులకు సత్వర సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
భారత్, నేపాల్‌లో భూకంపం సంభవించిన వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని సీఎం అన్నారు. నేపాల్, భారత్‌లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖను కూడా అప్రమత్తం చేశారు. అక్కడి మహా పర్యాటకులకు సహాయం అందించాలని, వారికి అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించినట్లు శనివారం ట్వీట్ చేశారు. పరిస్థితిని ప్రతిక్షణం సమీక్షిస్తున్నానని, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరానని చెప్పారు. నేపాల్‌లో సంభవించిన భూకంపం తూర్పు, ఉత్తర భారతదేశాన్ని కూడా కుదిపేసింది. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీని తీవ్రత కనబడింది.
ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో నేపాల్‌లోని రాష్ట్ర ప్రజల సహాయార్థం రాష్ట్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సీఎం సూచనమేరకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశామని, నేపాల్‌లోని రాష్ట్ర ప్రజలను గుర్తించడానికి ఈ విభాగం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సీఎం కార్యాలయం తెలిపింది. వివరాల కోసం న్యూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ సమీర్ సహాయ్ ఆధ్వర్యంలో 011-23380325 నంబర్ ఏర్పాటు చేసింది. బంధువులు, కుటుంబీకుల వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం 022-22027990 నంబర్‌ను ఏర్పాటుచేసింది.