ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..
సాక్షి, చెన్నై: సెల్ఫీ మోజుతో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగటానికి ఏమాత్రం వెనుకకాడటం లేదు. తాజాగా తమిళనాడులోని సేలం సమీపాన ఆదివారం కొండపై సెల్ఫీ తీసుకుంటూ లోయలో జారిపడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సేలంలోని కిచ్చిపాళయం అప్పర్ వీధికి చెందిన గణేశన్(25) ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
ఆదివారం సెలవు దినం కావడంతో గణేశన్ తన స్నేహితులు రాజ్‌కుమార్ (21), అభిషేక్ (25), జగన్ (21)లతో ఊత్తుమలై కొండపై ఉన్న మురుగన్ ఆలయానికి వెళ్లాడు. అక్కడ దర్శనం ముగించుకుని కొండపై నుంచి సేలం నగరపు అందాలను తిలకించారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసుకున్నారు. తర్వాత సమీపాన ఉన్న ఒక బండపై గణేశన్ నిలుచుని సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి 50 అడుగుల లోయలో జారిపడ్డాడు. దీంతో తలపై తీవ్రగాయం తగిలి గణేశన్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.