మైనర్ బాలిక (15)ను ఇంట్లో బంధించి వారం రోజులు అత్యాచారం చేసిన కేసులో పఠాన్ ఖాజాఖాన్ అనే వ్యక్తికి మరణించే వరకు కఠిన జైలు శిక్ష విధించారు.
కర్నూలు (లీగల్): మైనర్ బాలిక (15)ను ఇంట్లో బంధించి వారం రోజులు అత్యాచారం చేసిన కేసులో పఠాన్ ఖాజాఖాన్ అనే వ్యక్తికి మరణించే వరకు కఠిన జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పింది. శిక్షతో పాటు రూ. 2.20 లక్షల జరిమానా చెల్లించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి ఆదేశించారు. కర్నూలు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిత్తారి వీధికి చెందిన మైనర్ బాలికను పక్క వీధి ఖడక్‌పురకు చెందిన ఆటోడ్రైవర్ పఠాన్ ఖాజాఖాన్ 2013 నవంబర్‌లో వారం రోజులు తన గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలికను వారం రోజుల తర్వాత బయటకు తీసుకొచ్చి విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కొన్నాళ్లకు బాలికకు మగబిడ్డ పుట్టాడు. దీంతో ఖాజాఖాన్ చేసిన ఘాతుకంపై కర్నూలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేశారు. నిందితుడు నేరం రుజువు కావడంతో ఖాజాఖాన్‌కు మరణించే వరకు కఠిన జైలు శిక్ష పడింది.