బంపర్ విక్టరీ సాధించినా.. సంబరాలకు దూరం
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ సంబరాలు చేసుకోరాదని బీజేపీ నిర్ణయించింది. తమ విజయాన్ని సుక్మాలో మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు అంకితమిస్తున్నట్టు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో సంబరాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి తెలిపారు. తమ విజయాన్ని అమరవీరులకు అంకితమిస్తున్నట్టు బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట హోర్డింగులు పెట్టారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం రిఫరెండంగా మనోజ్ తివారీ పేర్కొన్నారు. ‘ఎంసీడీ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్ సర్కారుపై రిఫరెండమని ముందే చెప్పాం. పాలకులను రీకాల్ చేసే హక్కు ప్రజలకు ఉండాలని కేజ్రీవాల్ అడుగుతుంటారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఆయనను రీకాల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నార’ని తివారీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఆప్ రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఫలితాలు అధికారికంగా ప్రకటించాల్సివుంది.