తొలి ఆధిక్యాల్లో బీజేపీ దూకుడు
ఎన్నికల పండితులు చెప్పినదే నిజమయ్యేలా ఉంది. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. కార్పొరేషన్ ఎన్నికల్లో మూడో స్థానంలోనే కొనసాగుతోంది. మొత్తం 272 స్థానాలకు గాను 270 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఉత్తర ఢిల్లీలోని సరాయ్ పిపాల్, తూర్పు ఢిల్లీలోని మౌజ్‌పూ్ స్థానాల్లో అభ్యర్థులు మరణించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం ఉత్తర ఢిల్లీలో బీజేపీ 69, కాంగ్రెస్ 17, ఆప్ 15, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దక్షిణ ఢిల్లీలో బీజేపీ 74, కాంగ్రెస్ 15, ఆప్ 14, ఇతరులు 1 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తూర్పు ఢిల్లీలో బీజేపీ 39, కాంగ్రెస్ 13, ఆప్ 10, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు.
ఇదే ట్రెండ్ చివరకు వరకు కొనసాగితే మాత్రం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ మరోసారి చేజిక్కించుకోవడం ఖాయంలాగే కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యం కనబరిచినా, తాజా కార్పొరేషన్ ఎన్నికలలో పూర్తిగా చతికిలబడుతోంది. ఈవీఎంల గురించిన వివాదాలు, ఢిల్లీలో ప్రజారోగ్యం గురించిన విమర్శలు.. వీటన్నింటి నడుమ ఈ ఎన్నికలు జరగడం, వాటిలో బీజేపీ ఆధిక్యం చూపిస్తుండటం విశేషం.