సాక్షి, న్యూఢిల్లీ: బ్లూలైన్ మార్గంలో మెట్రో రైలు ప్రయాణం మరోసారి నగరవాసులకు చుక్కలు చూపించింది. సాంకేతిక సమస్య తలెత్తిన కారణంగా బుధవారం ఈ మార్గంలో మెట్రో రైళ్లు నెమ్మదిగా ప్రయాణించడమేకాకుండా పలు స్టేషన్లలో చాలాసేపు ఆగుతూ ఆలస్యంగా ముందుకుసాగాయి. దీంతో అనేక స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ద్వారకా సెక్టర్ 21 నుంచి నోయిడా, వైశాలి వరకుగల మెట్రో లైన్‌పై ఉదయం పది గంటలకు ఓ మెట్రో రైలు ఆగిపోయి ముందుకు కదలలేదు. చాలాసేపు మొరాయించింది. నోయిడా సిటీ సెంటర్ వెళ్లే మెట్రో రైలులోనే సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ద్వారకా సెక్టార్-21 నుంచి నోయిడాకు బయలుదేరిన ఈ రైలు ద్వారకా సెక్టార్ - 14 స్టేషన్‌లో ఆగిపోయింది. సమస్య ఈ రైలులోనే ఉన్నట్లు గుర్తించిన మెట్రో అధికారులు ప్రయాణికులందరినీ దించి ఆ తరువాత సమీపంలోని డిపోకు పంపారు. రైలులో తల్తెతిన సమస్య ఏమిటనేది పరీక్ష అనంతరం తేలుతుందని సంబంధిత అధికారులు చెప్పారు. ఈ సమస్య కారణంగా బ్లూలైన్‌పై ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలువురు ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకున్నారు. ఇతర లైన్లపై మాత్రం రైళ్లు యథావిథిగా నడిచాయి.
45 నిమిషాలసేపు ఆగిపోయింది
కపిల్ అనే ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ ద్వారకా సెక్టార్ -9లో ఉదయం గం 9.15 నిమిషాలకు మెట్రో రైలు ఎక్కానన్నాడు. ఆ తరువాత ఈ రైలు పది గంటలదాకా అక్కడే ఉండిపోయింది. ప్రయాణంలో ఆలస్యం కారణంగా నోయిడాలోని కార్యాలయానికి చేరుకునేసరికి మధ్యాహ్నం 12 గంటలైందన్నాడు. కాగా ఈ నెల రెండో తేదీన కూడా మెట్రో రైలు ప్రయాణికులు నానాయాతనలకు గురైన సంగతి విదితమే. ద్వారకా-నోయిడా సిటీసెంటర్-వైశాలి మార్గంలోని జనక్‌పురి స్టేషన్ సమీపంలో ఓవర్‌హెడ్ వైర్ తెగిపోయిన కారణంగా మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ మార్గంలో ప్రతిరోజూ దాదాపు ఏడు లక్షలమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
కాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్ సీ)... జాతీయ రాజధానితోపాటు జాతీయ ప్రాదేశిక ప్రాంతం పరిధిలోని గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్ మెట్రో రైలు సేవలను అందజేస్తోంది. ప్రపంచంలో 13వ అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ ఇదే. రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, వయోలెట్ అని ఐదు రకాల కలర్ కోడ్ లైన్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గం అత్యంత పొడవైనది. దీని పొడవు 193.2 కిలోమీటర్లు. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో మార్గంలో 38 భూగర్భ స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్లలో ఎస్కలేటర్లు, ఎలివేటర్లను ఏర్పాటుచేశారు. రోజుకు మొత్తం 2,700 ట్రిప్పులను డీఎంఆర్‌సీ నడుపుతోంది. ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి పదకొండు గంటలవరకూ వీటి సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. నాలుగు లేదా ఆరు బోగీలతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.
మళ్లీ మొరాయించిన బ్లూలైన్ మెట్రో
Published Wed, Sep 17 2014 10:26 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement
Advertisement