నాగపూర్: పంటలు పండక ఆర్థికంగా చితికిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలకు జీవితంపై ఆశలు రేపేందుకు మంట్‌ఫోర్ట్ ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్‌ల్ సెంటర్(ఎంఐఈసీ) కృషి చేస్తోంది. రెండేళ్ల క్రితం సర్ దొరబ్జి టాటా ట్రస్టు(ఎస్‌డీటీటీ) సహకారంతో సవోనర్ తాలూకా పటన్‌సొవంగి గ్రామంలో నెలకొల్పిన ఈ కేంద్రం అందరి మన్ననలను అందుకుంటోంది. కేవలం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల పిల్లలకు మాత్రమే వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది. ఆరు నెలలపాటు రెసీడెన్సీ వసతి కల్పించి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి 200 మంది యువకులకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వీరంతా వివిధ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్నారు.
వీరిలో యావత్మల్, వార్ధా జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నారని ఎంఐఈసీ డెరైక్టర్ బ్రదర్ మాథ్యూ అలెగ్జాండర్ మంగళవారం విలేకరులకు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని మండ్ల జిల్లాకు చెందిన పిల్లలు కూడా ఇక్కడ శిక్షణ తీసుకున్నారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పిల్లలు ఎవరైనా ఉంటే తమ భాగస్వామ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థలు గుర్తించి తమ కేంద్రానికి పంపుతాయని తెలిపారు. టైలరింగ్, బ్యూటీ కేర్, కార్పెంటరీ, వెల్డింగ్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ రిపేర్, మోటార్ మెకానిక్స్, ఎలక్ట్రిసియన్ తదితర రంగాల్లో వీరికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
తమ కేంద్రానికి వచ్చేవారికి ఆరు నెలల హాస్టల్ వసతిని కూడా కల్పిస్తున్నామని వివరించారు. తమ ఈ కార్యక్రమాలకి కొన్ని పెద్ద పారిశ్రామిక కంపెనీలు సహకారం అందిస్తున్నాయని చెప్పారు. మహీంద్రా నవిస్టర్ ద్వారా ఒక మోటార్ మెకానిక్ ల్యాబ్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఏర్పాటుచేసిందన్నారు. రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ రిపేర్ కోర్సుకు గోద్రెజ్ కంపెనీ ఆర్థిక సహాకారాన్ని అందిస్తుందని వివరించారు. అలాగే బ్యూటిషియన్ కోర్సు పూర్తి చేసిన వారికి కిట్‌లను కూడా పంపిణీ చేస్తుందని తెలిపారు. అలాగే విద్యార్థులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంప్యూటర్‌లను అందిస్తుందని చెప్పారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన కొంత మంది విద్యార్థులను గత వారంలో ముంబైలోని గోద్రెజ్ కంపెనీ నియమించుకుందని చెప్పారు.
రైతుల కుటుంబాల్లో ఎంఐఈసీ వెలుగులు
Published Tue, Oct 22 2013 11:42 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement
Advertisement