జీజీహెచ్ ఘటనపై మంత్రి సీరియస్
- విచారణకు ఆదేశం
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బతికున్న శిశువును చనిపోయినట్లు ధ్రువీకరించిన ఘటనపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు కారణాలపై తక్షణమే నివేదిక పంపాలని ఆదేశించారు. కాగా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. ఈ ఘటనకు కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా జిల్లాలోని దాసరిపాలెంనకు చెందిన భవానీ(23) కాన్పు నిమిత్తం ఈ రోజు ఉదయం జీజీహెచ్ కు వచ్చింది. ఆరున్నర గంటలకు సాధారణ డెలివరీ అయింది. పురిటిలోనే బాబు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది బాబును తండ్రికి ఇచ్చారు. దీంతో తండ్రి జగన్నాధం శిశువును సొంతూరికి తీసుకెళ్లి పూడ్చుతుండగా బాబులో కదలిక కనపడింది. కాసేపయిన తర్వాత ఏడవటం మొదలు పెట్టాడు. కాసింత ఆలస్యం చేసి ఉంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయేది. దీంతో జగన్నాధం కుటుంబసభ్యులు నిర్లక్ష్యానికి పాల్పడిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ కార్యాలయం వద్ద ఉదయం నుంచి ఆందోళన చేపడుతున్నారు.