‘అందాల’ పోటీలపైనా రాజకీయ క్రీనీడ
కాకినాడ పద్మనాభ ఫంక్షన్‌హాలు వేదికగా మిస్ కాకినాడ ఎంపిక మొదలైంది. ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టాలనే ఆసక్తి, ఉత్సాహంతో కాకినాడ పరిసర ప్రాంతాల యువతులు క్యూ కట్టారు. మిస్ కాకినాడ కిరీటం కోసం నిర్వహించిన అందాల పోటీల వేదిక అది. విశాఖకు చెందిన డ్రీమ్ మేకర్స్‌జ్ అనే సంస్ధ ఈ పోటీలు నిర్వహించింది. మిస్ కాకినాడకురూ.లక్ష, రెండు, మూడు∙రన్నరప్‌లకు రూ.50వేలు, నాలుగు సబ్ టైటిల్స్‌కు (బెస్ట్ ఐస్, బెస్ట్ హెయిర్, బెస్ట్ ఫిజిక్, బెస్ట్ స్కిన్ టోన్) రూ.25 వేల చొప్పున నగదు బహుమతి అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలతో యువతలో ఆశలు రేకెత్తించింది. బహుమతులకంటే ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టాలనే కోరికలే గుర్రాలై యువత క్యూ కట్టింది. యువత ఆశలను సొమ్ము చేసుకున్న పలువురు మిస్ కాకినాడ పోటీల్లో నిజాయితీ మిస్ అయ్యేలా వ్యవహరించారు.
తనవారిపై ‘పచ్చ’పాతం...
నాలుగు రౌండ్లలో నిర్వహించిన మిస్ కాకినాడ పోటీల్లో ఆయన మాటే వేదవాక్కయ్యింది. మొదట రౌండ్‌లో చీర, రెండవ రౌండ్‌లో పంజాబీ డ్రెస్, మూడవ రౌండ్‌లో తమ ఇష్టం మేరకు నచ్చిన డ్రెస్సులతో క్యాట్ వాక్. చివర టాలెంట్ రౌండ్‌లో డ్యాన్స్, పాటలు, మ్యాజిక్ ఇలా ఎవరి ఇష్టం వారిది. నాలుగు రౌండ్స్‌లో టోటల్‌గా ఉత్తమ ప్రతిభను కనుబరిచిన వారిని మిస్ కాకినాడగా ఎంపిక చేయాలి. నిర్వాహకులు అలానే చేద్దామనుకున్నారో ఏమో తెలియదు. తన స్నేహితురాలి కుమార్తె తన కుమార్తెతో సమానమని ఆ ముఖ్యనేత అందరి సమక్షంలో ప్రకటించడమంటేæఎంపికను ప్రభావితం చేయడం కాదా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. చివరకు ఎంపికలో ఆ ముఖ్య నేత చెప్పిన స్నేహితుడి కుమార్తే ఎంపిక కావడంతో తమ బిడ్డలకు అందం, ప్రతిభ ఉన్నా ఫలితం లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పోటీలకు సహకరించిన వారే ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం పూర్తిగా నిబంధనలకు విరుద్దమంటున్నారు. ప్రతిభ కనబరిచిన వారి పేర్లను తొలగించవద్దని న్యాయ నిర్ణేతల్లో ఒకరు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. అందం, ప్రతిభ ఆధారంగా రూపొందిన జాబితా తారుమారైపోయిందని, న్యాయనిర్ణేతల్లో ఒకరు మిస్‌కాకినాడ ఎంపిక తరువాత కొందరు తల్లిదండ్రులకు పంపిన మొబైల్ మెసేజ్‌లు నగరంలో హల్‌చల్ చేశాయి. చివరకు టాలెంట్ రౌండ్‌లో పాల్గొనని ఒక యువతిని రెండవ రన్నరప్‌గా ఎంపిక చేయడం మరింత ఆశ్చర్యం కలిగించిందంటున్నారు. ఇటువంటి పోటీలు నిర్వహించడం స్పాన్సర్లు, యాడ్ ఏజెన్సీల నుంచి లక్షలు సమీకరించుకోవడానికా లేక, ఇప్పుడిప్పుడే మెట్రో నగరాలతో పోటీ పడుతోన్న కాకినాడ వంటి నగరాల్లో ఔత్సాహిక యువత ఆశలపై నీళ్లు చల్లడానికా అని మండిపడుతున్నారు.