రాష్ట్రపతి ప్రణబ్‌తో స్టాలిన్ భేటీ
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం కే స్టాలిన్ పార్టీ నేతలతో కలసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి సమావేశమయ్యారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం పళనిస్వామి విశ్వాసపరీక్ష సందర్భంగా తలెత్తిన పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే, కేవలం అన్నాడీఎంకే నేతలతోనే స్పీకర్ విశ్వాసపరీక్ష నిర్వహించడంపై స్టాలిన్ ఫిర్యాదు చేశారు. విశ్వాస పరీక్ష చెల్లుబాటు కాదని ప్రకటించి, రహస్య బ్యాలెట్ ద్వారా మళ్లీ బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని ప్రణబ్‌ను కోరారు.
ఇప్పటికే తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిసి బలపరీక్ష సమయంలో తమపై వ్యవహరించిన తీరును స్టాలిన్ వివరించారు. నిరసనగా స్టాలిన్ ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేశారు. మరోవైపు బలపరీక్ష చెల్లదంటూ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు తన తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియో దృశ్యాలను ఆధారాలుగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.