టోల్ విధానంలో పారదర్శకత వచ్చేవరకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పోరాటం ఆగదని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే స్పష్టం చేశారు.
సాక్షి, ముంబై: టోల్ విధానంలో పారదర్శకత వచ్చేవరకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పోరా టం ఆగదని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే స్పష్టం చేశారు. రాష్ట్ర సర్కార్ తీరుకు వ్యతిరేకంగా బుధవారం తమ పార్టీ నిర్వహించనున్న ఆందోళనలో స్వయంగా పాల్గొంటానని, ధైర్యముంటే తనను అరెస్టు చేసుకోవచ్చని సవాల్ విసిరారు. పుణేలోని ఎస్‌పీ కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో రాజ్‌ఠాక్రే ప్రసంగం వాడివేడిగా సాగింది.
అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలపై నిప్పులు చెరిగారు. తాము టోల్‌కు వ్యతిరేకం కాద ని చెప్పారు. అయితే టోల్ వసూలు చేసే పద్ధతి, పారదర్శకత కొరవడడం, ఆ డబ్బులు ఎక్కడ వినియోగిస్తున్నారనేది తెలపకపోవడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. టోల్ విధానంలో పారదర్శకత వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
వసూలైన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి?
‘రోడ్డు కోసం 13 రకాల పన్నులు వసూలు చేస్తున్నా రు. వీటిలో వాహనం తీసుకున్న సమయం నుంచి రోడ్డు పన్ను, మోటర్ వెహికల్ ట్యాక్స్ రూపంలో రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. దీనిద్వారా ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.22,266 కోట్ల ఆదాయం వస్తోంది. మిగతా పన్నుల ద్వారా వేల కోట్లు వస్తున్నాయి. అయినా మళ్లీ 14వ పన్నుగా టోల్ వసూలు చేస్తున్నారు. అయితే టోల్ వసూలు చేయడాన్ని తప్పు బట్టడంలేదు.
కానీ టోల్ ద్వారా వసూలైన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయనే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంద’ని రాజ్‌ఠాక్రే అన్నారు. ముఖ్యంగా పుణే - సతారా రహదారిపై ఆనేవాడి టోల్ నాకా నుంచి 2010-13 వరకు ఆరు లక్షలకుపైగా వీఐపీ, వీవీఐపీ వాహనాలు వెళ్లాయన్నారు. వీటిలో రాష్ట్రపతి, ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రుల వాహనాలు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ తదితరాలు ఉన్నాయన్నారు. మరోవైపు ఖేడ్‌శివపూర్ టోల్‌నాకాపై నుంచి 19 లక్షలకుపైగా వీఐపీ, వీవీఐపీ వాహనాలు వెళ్లాయి.
ఈ రెండు టోల్‌నాకాల నుంచి సుమారు 40 లక్షల వాహనాలు టోల్ చెల్లించకుండా వెళ్లినట్టు చెప్పారు. అయితే నిజంగా ఇలా జరిగి ఉండదని, డబ్బులు దండుకునేందుకే దీనికి శ్రీకారం చుట్టారన్నారు. ‘టోల్ సమస్యను పరిష్కరించేందుకు తాము అన్ని విధాల ప్రయత్నించాం. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ను కలిశాం. కోర్టుకు వెళ్లాం. అయినా ఫలితం ఇంతవరకు లభించలేదు. దీంతో తమదైన శైలిలో ఆందోళనకు దిగామ’ని వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి ృపథ్వీరాజ్ చవాన్ కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి వారేనని ఎద్దేవా చేశారు. ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
పొరుగు రాష్ట్రాలు గుజరాత్, కర్ణాటకలలో టోల్ మహారాష్ట్ర కంటే తక్కువగా వసూలు చేసినప్పటికీ అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్ణాటకలో కోడ్లపై బస్టాండ్లు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో మాత్రం ముంబై, పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై మినహా మిగతా ఎక్కడా లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమాల ప్రకారం రెండు టోల్ నాకాల మధ్య దూరం కనీసం 80 కిలోమీటర్లు ఉండాలి. అయితే అలాంటి నిబంధనలు మన రాష్ట్రంలో ఎక్కడా పాటించినట్టు కనబడటం లేదన్నారు.
మరికొన్ని టోల్ నాకాల గడువు పూర్తయినా ఇంకా వసూలు ఆపడం లేదన్నారు. ‘ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై 2007- 11 మధ్యలో మొత్తం 20 వేల ప్రమాదాలు జరి గాయి. రెండు వేల మంది మృతి చెందారు. ప్రమాదాలకు కారణాలు మాత్రం రోడ్లు మరమ్మతులు చేపట్టకపోవడం, మార్గదర్శకాలు, రేడియం తదితరాలతోపాటు నియమాల ఉల్లంఘనే కారణమని ప్రభుత్వమే పేర్కొంది. తొందర్లోనే మహారాష్ట్ర నవ నిర్మాణ అప్లికేషన్ అందుబాటులోకి వస్తుంది. దీన్ని సెల్‌ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకున్నవారికి అన్ని వివరాలు తెలుస్తాయ’న్నారు. టోల్ విషయంలో ఎమ్మెన్నెస్ వైఖరిని తప్పుబట్టిన శివసేన అసలు ప్రతిపక్షమా, అధికార పక్షంలో ఉన్నారా? అని ఎద్దేవా చేశారు. భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.