ఆధునిక గాంధీ కావాలి : ప్రకాశ్‌ఝా
ఆధునిక గాంధీ కావాలి : ప్రకాశ్‌ఝా
Published Thu, Sep 5 2013 4:41 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ముంబై: సమాజంలోని ప్రతి వర్గం అవినీతిమయమైందంటూ విచారం వ్యక్తం చేశాడు బాలీవుడ్ దర్శకుడు ప్రకాశ్‌ఝా. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఆధునిక గాంధీ అవసరమన్నాడు. అవినీతి, అన్యాయాలపై మధ్యతరగతి పోరాటమే ఇతివృత్తంగా ప్రకాశ్‌ఝా తాజా చిత్రం ‘సత్యాగ్రహ’ రూపొందింది. గాంధీ సిద్ధాంతాలను విశ్వసించే వ్యక్తి కథే ఈ సినిమా. ‘మహాత్మా గాంధీనో లేక అన్నాహజారేనో స్ఫూర్తిగా తీసుకుని సత్యాగ్రహ సినిమా తీయలేదు. గాంధీ మహామనీషి. గొప్ప నాయకుడు. దేశానికంతటికీ స్ఫూర్తిప్రదాత. మనదేశానికి ఆధునిక గాంధీ చాలా అవసరం’ అని ఈ సందర్భంగా ప్రకాశ్ ఝా ఓ ఇంటర్య్యూలో పేర్కొన్నాడు.
‘దేశం అవినీతిమయమవడాన్ని చూసి సామాన్యుడు ఆగ్రహించడం లేదు. అవినీతిబాధితుల్లో తాను కూడా ఒకడినైనందుకే బాధపడుతున్నాడు. అలక్ష్యం వల్ల మరణం, పింఛన్ కోసం పోరాటం దేశంలో ప్రస్తుతం సర్వసాధారణమైపోయాయి. వీటిని ప్రేక్షకుల దృష్టికి తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించా. సమాజంలో మార్పు తీసుకురావాలనేది నా కోరిక’ అని చెప్పాడు.గత నెల 30వ తేదీన విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 44.19 కోట్లు వసూలు చేయడంపై ఝా సంతృప్తి వ్యక్తం చేశాడు.
‘ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణ నన్ను బాగా సంతోషానికి లోనుచేసింది. మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారనే విషయం దీంతో స్పష్టమైంది. గొప్ప గొప్ప సినిమాలు తీస్తానని నేనేనాడూ ప్రకటించలేదు. నా భావాలను అందరికీ తెలియజెప్పేందుకు సినిమాను ఓ మాధ్యమంగా ఎంచుకున్నాను’ అని చెప్పాడు.
Advertisement