సాక్షి,చెన్నై: రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్‌కు కేంద్రంలో పదవి దక్కిం ది. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవి ఆయన్ను వరించింది. దీంతో రాష్ట్రంలోని కమలనాథుల్లో ఆనందోత్సాహాలు నిండాయి. సంబరాల్లో మునిగి తేలారు.పదేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ చతికిలపడిన విషయం తెలిసిందే. ద్రవిడ పార్టీలు చీదరించుకోవడంతో ఆ పార్టీని అక్కున చేర్చుకున్న వాళ్లు లేరు. చిన్నా, చితక పార్టీలతో కలసి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చతికిలపడిన పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన పొన్ రాధాకృష్ణన్ శ్రమించారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా మెగా కూటమిని ఏర్పాటు చేయడంలో పొన్ రాధాకృష్ణన్ కీలక పాత్ర పోషించారు.
ఎన్నికల్లో తమ కూటమికి అత్యధిక స్థానాల్లో ఓటమి ఎదురైనా రెండు సీట్లు దక్కించుకోవడం బీజేపీలో ఆనందాన్ని నింపింది. కన్యాకుమారి నుంచి పొన్ రాధాకృష్ణన్ విజయ ఢంకా మోగించారు.కేంద్రంలో పదవి : ఎంపీ గెలుపొందిన పొన్ రాధాకృష్ణన్‌కు బీజేపీ అధిష్టానం గుర్తింపును ఇచ్చింది. రాష్ట్ర పార్టీ బలోపేతానికి శ్రమించిన ఆయన్ను గౌరవించే విధంగా కేంద్ర సహాయ మంత్రి పదవిని అప్పగించింది. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర సహాయ మంత్రిగా పొన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. పదేళ్ల తర్వాత రాష్ట్రం నుంచి తమ ప్రతినిధి ఎన్నిక కావడంతో పాటుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి పదవి రావడంతో బాణ సంచాలు పేల్చుతూ పండుగ చేసుకున్నారు.
రెండో సారి మంత్రిగా: పొన్ రాధాకృష్ణన్‌ను రెండో సారి కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. బ్రహ్మచారిగా ఉన్న రాధాకృష్ణన్ తొలుత హిందూ మున్ననిలో చురుగ్గా రాణించారు. హిందూ మున్నని నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లోకి వెళ్లిన ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదిగారు. కన్యాకుమారి జిల్లా పరిధిలో పూర్వం ఉన్న నాగుర్‌కోయిల్ లోక్‌సభ నుంచి 1999లో ఎన్నికయ్యారు. ప్రధాని వాజ్‌పాయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో యువజన సర్వీసులు, క్రీడల శాఖ సహాయ మంత్రి పదవి ఆయన్ను వరించింది. 2004లో అదే స్థానం బరిలో మళ్లీ నిలబడ్డా ఓటమి తప్పలేదు. 2009లో నాగుర్ కోయిల్ గల్లంతై, కన్యాకుమారి ఆవిర్భవించడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. అయితే, ద్రవిడ పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించారేగానీ, విజయాన్ని అందుకోలేకపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ ఢంకాతో కేంద్రంలో మళ్లీ మంత్రి పదవిని కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళల్లో అత్యధిక భూ భాగం సముద్ర తీరం ఉండటం, ఇక్కడి హార్బర్ల ద్వారా అత్యధిక ఆదాయం కేంద్రానికి వస్తుండటంతో ఆయనకు కేంద్ర నౌకాయన శాఖ సహాయ మంత్రి పదవిని అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అన్భుమణికి భంగ పాటు: కేంద్రంలో పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్న అన్భుమణి రాందాసుకు భంగ పాటు తప్పలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పీఎంకే బరిలోకి దిగింది. ఎంపీగా గెలిస్తే అన్భుమణికి చోటు కల్పిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సీట్ల పందేరం సమయంలో సంకేతాలు వెలువడ్డాయి. ఆ పార్టీ 8 చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టింది. పార్టీ అధినేత రాందాసు తనయుడు అన్భుమణి రాందాసు ధర్మపురి నుంచి తొలి సారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈ గెలుపుతో కేంద్రంలో తమకు పదవి దక్కుతుందన్న ఆశ పీఎంకే వర్గాల్లో నెలకొంది. అన్భుమణి రాందాసు గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కేబినెట్ హోదాతో పనిచేసినదృష్ట్యా, ఈ సారి అదే హోదాతో ఏదేని పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్న అన్భుమణికి బీజేపీ ఝలక్ ఇచ్చింది. ఆయనకు మొదటి విడతలో పదవి దక్కలేదు. కేబినెట్ విస్తరణలో ఏమైనా అవకాశాలున్నాయేమో వేచిచూడాల్సిందే!
‘రాధా’కు పదవి!
Published Tue, May 27 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM
Advertisement
Advertisement