రాజీనామాకు సిద్ధం!
సాక్షి, చెన్నై: కులచల్ హార్బర్ ప్రాజెక్టు సాధన కోసం అవసరం అయితే, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పోరాటాలకు సిద్ధమని పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. డీఎంకే, అన్నాడీఎంకేలు ఐక్యతతో పనిచేసి, రాష్ట్ర ప్రగతి మీద దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
కన్యాకుమారి జిల్లా కులచల్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వర్తక రీత్యా హా ర్బర్ నిర్మాణానికి కసరత్తుల్లో నిమగ్నమైంది. ఇందుకు తగ్గ ప్రకటనను ఎన్నిక ల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. అయితే, ఈ ప్రకటన తరువాయి, ప్రజల్లో ఆందోళన రేకెత్తించే రీతిలో సముద్ర తీరాల్లో ప్రచారం సాగుతున్నది. ప్రజల స్థలాల్ని బలవంతంగా లాక్కుంటారని, హార్బర్ పేరిట తీర వాసుల్ని బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయని, గోడౌన్ల పేరిట వ్యవసాయ భూముల్ని లాక్కునే ప్రమాదం ఉందన్న ప్రచారం బయలు దేరింది.
దీనిని పనిగట్టుకుని కొన్ని పార్టీలు చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ గురువారం నాగుర్ కోయిల్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కొందరు ఆరోపణలు గుప్పిస్తూ , ప్రజల్ని రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం అవసరం అయితే, తన మంత్రి పదవికి రాజీనామా చేసి పోరుబాట సాగించేందుకు సైతం తాను సిద్ధం అని ప్రకటించారు.
ఈ ప్రాజెక్టుతో కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాలు ఆర్థిక ప్రగతిని సాధిస్తాయని, అయితే, దీనిని అడ్డుకోవడం లక్ష్యంగా కుట్రలు సాగుతున్నామని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో తిరుగుతూ, ఆయా దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాల మేరకు కొత్త ప్రాజెక్టుల్ని దేశంలోకి తీసుకు వస్తున్నారని వివరించారు. డీఎంకే, అన్నాడీఎంకేలు సమిష్టిగా, ఐక్యతతో వ్యవహరించి కేంద్రం నుంచి పథకాలు, ప్రాజెక్టుల్ని రాష్ట్రంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రగతికి రెండు పార్టీలు కేంద్రంతో కలిసి ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.
తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ బీజేపీ మీద నిందలు వేయడం మానుకుని, కాంగ్రెస్ బలోపేతం మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇప్పటికే కాంగ్రెస్ చతికిలబడిందని, విస్మరిస్తే అథోగతి తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న పుణ్యమా డీఎంకే ఇబ్బందుల్లో పడాల్సి వ చ్చిందని వ్యాఖ్యానించారు.