![కూతుళ్లతో తల్లి ఆత్మాహుతి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41396030164_625x300.jpg.webp?itok=CjFO5isF)
కూతుళ్లతో తల్లి ఆత్మాహుతి
ప్యారిస్, న్యూస్‌లైన్: భర్త మద్యం అలవాటుతో జీవితంపై విరక్తి చెంది, కన్న కుమార్తెలను సజీవ దహనం చేసిన తల్లి, ఆత్మాహుతి చేసుకున్న సంఘటన తిరుచ్చిలో శుక్రవారం కలకలం రేపింది. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలోని పుత్తనై పక్కన ఉన్న కంబిలంపట్టికి చెందిన ముత్తళగు (34) బోర్‌వెల్ బండిలో పని చేస్తున్నాడు. ఇతనికి మీనా (28)తో వివాహమై 8 సంవత్సరాలు అవుతోంది.
వీరికి ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు సరస్వతి (7), సత్య (3), ధనలక్ష్మి (1) ఉన్నారు. వీరిలో సరస్వతి వడక్కు ఇలయపట్టిలో రెండో తరగతి చదువుతోంది. సత్య ఆ ప్రాంతంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతోంది. ఇప్పుడు మళ్లీ మీనా గర్భవతి అరుుంది. అరుుతే ముత్తళగు మద్యానికి బానిసై రోజు రాత్రి ఇంటికి తాగి వచ్చి మీనాతో గొడవకు పడేవాడు. అంతేగాకుండా లైంగిక, శారీరక వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. ఈ స్థితిలో ఇటీవల ముత్తళగుకు చేతికి గాయం ఏర్పడడంతో పనికి వెళ్లడం లేదు.
ఆదాయం లేక మీనా కుటుంబాన్ని పోషించేందుకు తీవ్రంగా పోరాడుతూ వచ్చింది. ఈ క్రమంలో గురువారం రాత్రి ముత్తళగు మద్యం తాగి, ఇంటికి వచ్చి మీనాతో గొడవపడ్డాడు. అనంతరం శుక్రవారం వేకువజామున ఇంటిలో నుంచి ముత్తళగు బయటకు వెళ్లిపోయాడు. భర్త ప్రవర్తనతో జీవితంపై విరక్తి చెందిన మీనా ఉదయం 7.30 గంటల సమయంలో ముగ్గురు కుమార్తెలపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఆ తర్వాత తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
దీంతో మంటలకు తట్టుకోలేక అందరూ పెద్దగా గావు కేకలు పెట్టారు. వారి కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకున్నారు. అరుుతే సంఘటనా స్థలంలోనే మీనా, సరస్వతి, సత్య మృతి చెందారు. ప్రాణాలతో పోరాడుతున్న ధనలక్ష్మిని మనప్పారై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ చిన్నారి చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో విషాదం నింపింది.