వైఎస్ వల్లనే పైడిపాలెం సాకారం
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషివల్లనే పైడిపాలెం ప్రాజెక్టు సాకారమైందని, పులివెందులకు కృష్ణాజలాలు వస్తున్నాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెం వద్ద బుధవారం సీఎం చంద్రబాబు చేపట్టిన జన్మభూమి సమావేశంలో ఆయన ప్రసంగించారు. నాడు వైఎస్సార్ పైడిపాలెం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మూడేళ్లలో రూ.660 కోట్లు వెచ్చించడం వల్లనే నేడు గండికోట నీరు తెచ్చుకోవడం సాధ్యమైందని తెలిపారు.
మూడేళ్ల అనంతరం పెండింగ్ పనులు చేసి నీరు తీసుకొని రావడం పట్ల రైతులు హర్షిస్తున్నారని చెప్పారు. పులివెందులకు కృష్ణా జలాలు తీసుకురావాలన్న వైఎస్సార్ కలలు సాకారమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. గండికోట నిర్వాసితులకు ఇచ్చినట్లుగా పైడిపాలెం ముంపు గ్రామానికి పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని అభ్యర్థించారు. జీకేఎల్‌ఐలో అంతర్భాగమైన పైడిపాలెంకు సైతం యూనిట్‌కు రూ.6.75 లక్షలు మంజూరు చేయాలని కోరారు. అలాగే 2012–13 శనగ పంట బీమాకు సంబంధించి పరిహారం ఇవ్వాలన్నారు. ఆయన ‘జోహార్ వైఎస్సార్’ అనగానే సభికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. దీంతో చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు నిశ్చేష్టులయ్యారు. ఎంపీ ప్రసంగానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడంతో చేసేది లేక మైకును కట్ చేసి, ముఖ్యమంత్రి తిరిగి ప్రసంగం అందుకున్నారు.
పోలీసుల ఓవర్ యాక్షన్
పులివెందుల: సీఎం పర్యటన సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిల పట్ల బుధవారం పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెం వద్ద జరిగే జన్మభూమి సభకు వీరిని వెళ్లకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఉదయం నుంచే అవినాష్‌రెడ్డి, వివేకానందరెడ్డిల ఇంటి వద్ద పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. ఇంటి వద్ద నుంచి జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఎంపీ, వివేకాలను అక్కడ కూడా అడ్డుకున్నారు. అనంతరం పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
పోలీసులతో తోపులాట మధ్య ఎంపీ అవినాష్‌రెడ్డి సింహాద్రిపురం మండలంలోని కోవరంగుంటపల్లెలోని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అక్కడినుంచి పైడిపాలెం వెళుతున్న ఎంపీని పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో కార్యకర్తలతో కలిసి ఆయన బలవంతంగా పైడిపాలెం ప్రాజెక్టు జన్మభూమి కార్యక్రమానికి వెళ్లారు.