
జమ్మలమడుగు: మంత్రి ఆదినారాయణరెడ్డి కోటకు బీటలు వారతాయనే భయం పట్టుకోవడంతోనే తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని, జిల్లాలో అరాచకం సృష్టించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి ఆదినారాయణరెడ్డి తిరిగి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. గతంలో పులివెందులలో, ప్రస్తుతం జమ్మలమడుగు మండలంలో జరిగిన ఘటనలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని డీఎస్పీ బంగ్లా ఆవరణలో పెద్దదండ్లూరు బాధితులైన సంపత్, అజరయ్యతో కలిసి విలేకరులతో మట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా దేవగుడి చుట్టుపక్కల గ్రామాల్లో ఏకపక్షంగా ఓటింగ్ జరుగుతోందని, ఆ గ్రామాల్లో వైఎస్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
ఇటీవల వివాహం అయిన వధూవరులు.. ఆశీర్వదించాలని తమను ఆహ్వానించారని, దీంతో వైఎస్సార్‌సీపీకి ఆదరణ పెరుగుతుందనే భయం మంత్రికి పట్టుకుందన్నారు. సుగుమంచిపల్లె, పెద్దదండ్లూరు గ్రామాల్లో తమ అనుచరులైన సంపత్, అజరయ్య, అయ్యవారు, సుబ్బిరామిరెడ్డిపై దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. మంత్రి కుమారుడు, అన్నదమ్ములు దగ్గరుండి దాడులను చేయించినా పోలీసులు వారిని అరెస్టు చేయకుండా తమను అడ్డుకున్నారని తెలిపారు.
మంత్రి అనుచరులు ఫర్నీచర్ ధ్వంసం చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. పోలీసులు ప్రభుత్వానికి, మంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. బాధితులు మంత్రి కుటుంబసభ్యులు, సోదరులపైన ఫిర్యాదు చేశారని..ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి.. భవిష్యత్తులో దాడులు చేయాలంటేనే టీడీపీ శ్రేణులు భయపడే విధంగా చర్యలు ఉండాలని ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment