మరో భారీ ఉద్యమానికి ముద్రగడ సై
మరో భారీ ఉద్యమానికి ముద్రగడ సై
Published Tue, Nov 15 2016 4:04 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
కాపు రిజర్వేషన్ల కోసం మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి రోడ్డెక్కుతున్నారు. కాపులను బీసీలలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, తుని ఘటన తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు మంత్రుల బృందం వచ్చి ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని ముద్రగడ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దాంతో.. కాపులకు చంద్రబాబు చేసిన ద్రోహానికి నిరసనగా నవంబర్ 16 నుంచి ఐదు రోజుల పాటు సత్యాగ్రహ పాదయాత్ర చేయనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అక్టోబర్ 14వ తేదీనే ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంత ఇంట్లో ఆయన ఈ విషయం తెలిపారు. ఆగస్టులోగా కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట తప్పారని ఆయన మండిపడ్డారు. దానికి నిరసగానే తాను పాదయాత్ర చేపడుతున్నానన్నారు. రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్ర ప్రారంభించి, అంతర్వేదిలో ముగిస్తానని చెప్పారు. నల్ల రిబ్బన్లు ధరించి ఈ పాదయాత్ర చేస్తానన్నారు. ఇంతకుముందు ఆయన తుని సమీపంలో కాపు ఐక్య గర్జన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా ప్రభుత్వం బలవంతంగా ఆయనను ఆస్పత్రికి తరలించింది.
అణిచివేతకు సర్కారు రె'ఢీ'
ముద్రగడ పాదయాత్రను అణిచివేసేందుకు రాష్ట్రప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారు. ఇప్పటికే వాటర్ క్యానన్లు సిద్ధం చేశారు, ఇతర రాష్ట్రాల నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రప్పించి మోహరించారు. అయితే ప్రభుత్వ చర్యలను అధిగమించి మరీ పాదయాత్రను విజయవంతం చేయాలని కాపు జేఏసీ భారీ ఏర్పాట్లు చేసింది. రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగించి తీరుతామని జేఏసీ స్పష్టం చేసింది.
Advertisement
Advertisement