పన్నీర్ సెల్వం హత్యకు కుట్ర.. అంతా అబద్ధం
చెన్నై: తమిళనాడు తిరుచ్చి ఎయిర్‌పోర్టులో శనివారం అన్నాడీఎంకే మద్దతుదారుడు కత్తితో పట్టుపడిన సంఘటన కలకలం సృష్టించింది. ఆ సమయానికి అక్కడకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను అనుమానాస్పదంగా సమీపిస్తుండటంతో అనుమానం వచ్చిన సీఐఎస్‌ఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అతని దగ్గర నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పన్నీర్ సెల్వంను హత్య చేయడానికే అతడు కత్తి పట్టుకొచ్చాడని తమిళ మీడియా పదే పదే ప్రసారం చేసింది.
కానీ అది వాస్తవం కాదని విచారణలో పోలీసులు నిర్థారణకు వచ్చారు. నిందితుడి పేరు చోళరాజన్(50). వృత్తి రీత్యా నాయిబ్రాహ్మణుడు కావడంతో కత్తితో ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అంతేకాకుండా పన్నీర్ సెల్వం వర్గానికి అతడు మద్దతుదారుడు. తమ నాయకుడు వస్తున్నాడని తెలియడంతో కలవడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు మీడియాకు తెలిపాడు. అయితే మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా తమిళ మనీల కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. పన్నీర్ సెల్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తుండటం వల్లే హత్యాయత్నం జరిగినట్టు పేర్కొన్నారు.