మళ్లీ బెల్లం దందా | nalla bellam illegal transport in mahabubabad | Sakshi
Sakshi News home page

మళ్లీ బెల్లం దందా

Published Thu, Nov 17 2016 12:05 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

మళ్లీ బెల్లం దందా - Sakshi

మళ్లీ బెల్లం దందా

ఇతర రాష్ట్రాల నుంచి మరిపెడ మీదుగా దిగుమతి
తండాలకు సరఫరా చేస్తున్న వ్యాపారులు
పోలీసుల కళ్లుగప్పి రవాణా
గుట్టల్లో భారీగా డంప్‌
 
సాక్షి, మహబూబాబాద్‌ : నల్లబెల్లం దందా మళ్లీ మొదలైంది. గుడుంబా తయారీ, విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కొంతకాలం స్తబ్దుగా ఉన్న వ్యాపారులు మళ్లీ మొదలు పెట్టారు. గుడుంబాను 90శాతం నిర్మూలించామని ఓవైపు అధికారులు చెబుతున్నా.. మరోవైపు నల్లబెల్లం సరఫరా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ అక్రమ రవాణాకు మానుకోటలో సుమారు పది మంది బెల్లం వ్యాపారులు తెరలేపిట్లు సమాచారం.
 
ఆగని రవాణా
జిల్లాలో బెల్లం అక్రమ రవాణా ఆగడంలేదు. అక్రమసంపాదనకు అలవాటు పడిన వ్యాపారులు అడ్డదారుల్లో బెల్లం సరఫరా చేస్తున్నారు. సిండికేట్‌గా ఏర్పడి ఎక్సైజ్‌ అధికారులను మచ్చిక చేసుకుని తండాలకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, నల్లగొండ, జిల్లాల నుంచి మరిపెడ మీదుగా మహబూబాబాద్‌కు సరఫరా చేస్తున్నారు. ఈ వ్యాపారం అంతా మండలాల శివారుల్లో జరుగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల పరిధి తమది కాదంటే తమది కాదంటూ సాకులు చెబుతూ ఎక్సైజ్‌ అధికారులు దాటవేస్తున్నారు. దీంతో ఇదంతా వారి కనుసన్నల్లోనే కొనసాగుతోందని తెలుస్తోంది.
 
ఇతర రాష్ట్రాల నుంచే...
నల్లబెల్లాన్ని మహారాష్ట్ర నుంచి నేరుగా హైవే మీదుగా మరిపెడకు తరలించి, అక్కడి నుంచి మహబూబాబాద్‌ ప్రాంతంలోని శివారు తండాల్లో డంప్‌ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒంగోలు నుంచి నేరుగా లారీల ద్వారా వేల టన్నుల కొద్ది బెల్లాన్ని దిగుమతి చేస్తూ కోట్లాది రూపాయల వ్యాపారం సాగిస్తున్నారు. మహారాష్ట్రలో క్వింటాల్‌కు రూ.3వేలు కొనుగోలు చేసి ఇక్కడ రూ.6,500 నుంచి రూ.7వేలకు పైగా ధరకు విక్రయిస్తున్నారు. దీంతో ఒక్కో లారీకి రూ.6లక్షలకు పైగా లాభాలు వస్తున్నాయి. ఎక్కడోచోట దొరికితే ఇతర వ్యక్తుల పేరిట కొనుగోలు చేసినట్లు తప్పుదారి పట్టిస్తూ కేసులు నుంచి బయటపడుతున్నారు. ఇటీవల మహబూబాబాద్‌ రూరల్‌లో 4 టన్నుల బెల్లం, కురవిలో 65 క్వింటాళ్లు, 10 క్వింటాళ్ల పటికను  పట్టుకున్నారు. నేరడ క్రాస్‌ రోడ్‌లో 6 క్వింటాళ్ల బెల్లంతో పాటు 50కిలోల పటికను కురవిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కేసముద్రంలోని గిర్నితండాలో 1500 లీటర్ల బెల్లం పానకాన్ని పట్టుకుని ఎక్సైజ్‌ అధికారులు ధ్వంసం చేశారు.
 
పోలీసుల కళ్లు గప్పి..
మహబూబాబాద్‌ జిల్లాకు రోజూ రెండు నుంచి మూడు లారీల నల్లబెల్లం వస్తోందని సమాచారం. బెల్లం వ్యాపారులు పోలీసుల కళ్లుగప్పి తెల్లవారుజామున రవాణా సాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బెల్లంలోడు లారీలను మరిపెడ, కురవి, మహబూబాబాద్‌ శివారు ప్రాంతాల్లో నిలిపి తెల్లవారుజామున ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా తండాలకు పంపుతున్నారు. లారీ దిగుమతి చేస్తున్న సమయంలోనే కొనుగోలుదారులు అక్కడే డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ తిరుగుతున్నా, వారికంట పడకుండా లారీకి ముందు, వెనుక ఎస్కార్ట్‌లా వ్యాపారులే ద్విచక్రవాహనాలతో వెళ్తూ బెల్లాన్ని చేర్చుతున్నారు. బెల్లాన్ని భారీగా తెచ్చి గుట్టల మధ్య డంప్‌ చేస్తూ తమ అడ్డాగా మార్చుకున్నారు.
 
తనిఖీలు.. తక్కువ
బెల్లం దందా జోరుగా సాగుతున్నప్పటికీ ఎక్సైజ్‌ అధికారులు మాత్రం ఎక్కడో ఓ చోట 50కిలోల నుంచి క్వింటా బెల్లాన్ని పట్టుకుంటున్నారే తప్పా.. లారీల కొద్ది దిగుమతి చేసే వ్యాపారుల జోలికి మాత్రం వెళ్లడం లేదు. తనిఖీల్లో 10 క్వింటాళ్ల నిల్వలు మాత్రమే పట్టుబడుతున్నాయి. ప్రధాన రహదారుల్లో తనిఖీలు నిర్వహించకపోవడంతో యథేచ్ఛగా వ్యాపారం కొనసాగుతోంది. జిల్లాలో బెల్లం అక్రమ రవాణా ఎక్సైజ్‌ అధికారుల కనుసన్నల్లోనే జోరుగా వ్యాపారం జరుగుతుందని సమాచారం.  
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement