వనరులు అందుబాటులో ఉంటే కొత్త నీటిపారుదల ప్రాజెక్టులను రాష్ట్ర సర్కార్ స్వేచ్ఛగా చేపట్టుకోవచ్చని గవర్నర్ కె.శంకర్ నారాయణన్ అన్నారు.
ముంబై: వనరులు అందుబాటులో ఉంటే కొత్త నీటిపారుదల ప్రాజెక్టులను రాష్ట్ర సర్కార్ స్వేచ్ఛగా చేపట్టుకోవచ్చని గవర్నర్ కె.శంకర్ నారాయణన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభావంతులైన ఇంజీనీర్‌లకు నగరంలో గురువారం జరిగిన సన్మాన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్కార్ చేపట్టే కొత్త ప్రాజెక్టులను గవర్నర్ ఆపుతారనే ప్రశ్నే లేదన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై రోజువారీ సమీక్ష నిర్వహించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేలా దృష్టి సారించాలని సర్కార్‌కు ఆయన సలహా ఇచ్చారు.
అన్ని విభాగాలతోని అనుసంధానమై ఉండే మౌలిక వసతులపై కచ్చితమైన ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్లాలని అన్నారు. ఇలాంటివి గుర్తించడం వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం సులభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్, నీటిపారుదల శాఖ మంత్రి సునీల్ తట్కరే, ప్రజా పనుల విభాగ మంత్రి జయదత్ క్షీర్‌సాగర్, నీటి పారుదల, పరిశుభ్రత శాఖ మంత్రి దిలీప్ సొపల్, గిరిజనాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజేంద్ర గవిత్ పాల్గొన్నారు.