ముంబై: పేదల అభివృద్ధికి తమ ప్రభుత్వం పాటుపడుతుందని గవర్నర్ శంకర నారాయణన్ పేర్కొన్నారు.బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన ప్రసంగించారు. 40 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో గవర్నర్... మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, ఈ-గవర్నెన్స్, పారిశ్రామిక పెట్టుబడులు, నిరుపేదలు, అణగారిన వర్గాలు, నిరుపేదలకు చేయూత, కరువు నివారణకు తీసుకుంటున్న చర్యలను సమగ్రంగా వివరించారు. మొత్తం 4,484 కిలోమీటర్ల మేర రహదార్లను అభివృద్ధి చేశామన్నారు.
మొత్తం 67 టోల్‌ప్లాజాలను మూసివేశామన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోనే అత్యధికంగా ఈ రాష్ట్రానికే వచ్చాయన్నారు. 8.7 కోట్ల మందికి ఆధార్ కార్డులు మంజూరయ్యాయన్నారు. ప్రసవ మరణాలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. కొలాబా-బాం ద్రా-సీప్జ్ మెట్రో మార్గానికి కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. నాగపూర్, పుణే మెట్రో మార్గాలు మౌలిక రంగ వికాసానికి సూచికలన్నారు. కరువుపీడిత ప్రాంతాల్లో బకాయిలపాలైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. వడ్డీ వ్యాపారుల బారినపడిన వారు ఫిర్యాదులు చేసేందుకు హెల్ప్‌లైన్‌ను ప్రారంభించామన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా వంద శాతం మేర విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు.
డిజిటలీకరించాం
రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలను ప్రభుత్వం డిజిటలీకరించిందని గవర్నర్ పేర్కొన్నారు. డిజిటలీకరించిన మ్యాపులన్నీ ఆయా ప్రభుత్వ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయన్నారు. కోస్తా తీర ప్రాంతంలోని మడ అడవులన్నీ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోకి వ చ్చాయన్నారు. వంద హెక్టార్ల స్థలంలో మడ అడవుల పెంపకం ప్రారంభమైందన్నారు.
కౌన్సిల్‌లో వాకౌట్
గవర్నర్ ప్రసంగంపై అధికార పక్షం ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు విధానమండలి నుంచి సోమవారం వాకౌట్ చేశాయి. అంతకుముందు శివసేన సభ్యుడు దివాకర్ రావుతే మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనప్పుడు ఇక ఆ తీర్మానం ఎందుకన్నారు. కాగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎన్సీపీ సభ్యుడు హేమంత్ టకాలే ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంపై ఈ సమావేశంలో చర్చ జరగబోదన్నారు. వర్షాకాల సమావేశాల్లో చర్చిస్తామన్నారు. అందువల్ల ఈ తీర్మానాన్ని ఇప్పుడు ఆమోదించాల్సిందేనన్నారు. దీంతో శివసేన, బీజేపీ సభ్యులు రాందాస్ కదమ్ తదితరులు మండలినుంచి వాకౌట్ చేశారు.
చర్యలు తీసుకుంటాం : హోం మంత్రి
రుణగ్రహీతల వద్దనుంచి అత్యధిక మొత్తంలో వడ్డీ వసూలు చేసే మహిళా స్వయం సహాయక సంఘాలపై చర్యలు తీసుకుంటామని రాష్ర్ట హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ హెచ్చరించారు. రాష్ట్రంలో వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును సోమవారం సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో జోక్యం చేసుకుంటూ కొన్ని సంఘాలు అసాధారణ రీతిలో వడ్డీ వసూలు చేస్తున్నట్టు తనకు ఫిర్యాదులు అందాయన్నారు.
ఈ అంశాన్ని సభలో లేవనెత్తిన స్పీకర్ దిలీప్‌వాల్సే పాటిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్డీ వ్యాపారులను తలదన్నేరీతిలో స్వయంసహాయక సంఘాలు రుణగ్రహీతలనుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయన్నారు. కాగా 2010లో ప్రవేశపెట్టిన మహారాష్ట్ర మనీలెండింగ్ (రెగ్యులేషన్) బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించిన సంగతి విదితమే. అయితే కేంద్ర ఆర్థిక శాఖ చేసిన సిఫారసులను ఆధారంగా చేసుకుని హోం మంత్రిత్వ శాఖ సూచనలమేరకు కొన్ని బ్యాంకింగ్ సంస్థల కార్యకలాపాలను ఇందులో నుంచి మినహాయించారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
సభ రెండుసార్లు వాయిదా
ఊహించినట్టుగానే ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ప్రజాస్వామ్య కూటమి (డీఎఫ్) ప్రభుత్వం చివరిసారిగా ప్రవేశపెట్టనున్న ఈ మధ్యంతర బడ్జెట్ సమావేశాల తొలిరోజున ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరించాయి. సభ ప్రవేశద్వారం వద్దగల మెట్లపై కూర్చుని నినాదాలు చేయడంతోపాటు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.
ఎన్నికలు నియమావళి ఇంకా అమల్లోకి రానందువల్ల కనీసం 14 రోజులైన సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశాయి.
అంతటితో ఆగకుండా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో గందరగోళం నెలకొంది. ఈ కారణంగా సభ రెండుసార్లు వాయిదాపడింది.
వికాసమే లక్ష్యం
Published Mon, Feb 24 2014 10:53 PM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM
Advertisement
Advertisement