ప్రాజెక్టుల్లో కదలిక | New Delhi projects Embarking | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల్లో కదలిక

Published Thu, Apr 17 2014 10:13 PM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM

New Delhi projects Embarking

 న్యూఢిల్లీ:సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా స్తంభించిన పథకాలు/అభివృద్ధి ప్రాజెక్టులు పునఃప్రారంభం కానున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈ నెల 10న రద్దయింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులను తిరిగి మొదలుపెట్టడంపై చర్చించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ.. ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి విజయ్‌దేవ్‌తో త్వరలోనే భేటీ కానున్నారు. ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో ప్రాజెక్టులను పునఃప్రారంభించాలని ఎన్నికల సంఘం ఇది వరకే సంబంధిత విభాగాలను ఆదేశించింది. ‘విజయ్‌దేవ్‌ను ఇది వరకే ఓసారి కలుసుకున్నాను. త్వరలోనే సమావేశాలు నిర్వహిస్తాం. విద్యుత నీరు, రోడ్ల వంటి ప్రాజెక్టులను తక్షణం ప్రారంభించాల్సి ఉంది. రోడ్లు, నీటిపారుదల, వరదల నియంత్రణకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రజాపనులశాఖ (పీడబ్ల్యూడీ) మొదలుపెట్టాల్సి ఉంది’ అని శ్రీవాస్తవ వివరించారు.
 
 రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే చేపట్టిన 11 కిలోమీటర్ల పొడవైన మోనోరైలు ట్రాక్, వజీరాబాద్ సిగ్నేచర్ బ్రిడ్జి వంటివి ఎన్నికల నియమాల వల్ల నిలిచిపోయాయి. మోనోరైలు మార్గాన్ని శాస్త్రిపార్కు నుంచి త్రిలోక్‌పురి నిర్మిస్తారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం చేపట్టిన వికాస్‌పురి-వజీరాబాద్ రింగురోడ్డు, మరొకొన్ని పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఔటర్‌రింగు రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ రెండు మార్గాల మధ్య ట్రాఫిక్ సిగ్నల్ రహిత ప్రయాణం సాధ్యపడుతుంది. ఆహార భద్రతలో భాగంగా పేదల కోసం ప్రారంభించిన అన్నశ్రీ యోజన కూడా ఎన్నికల సమయంలో నిలిపివేశారు.
 
 ఈ పథకం లబ్ధిదారులకు ఆహార ధాన్యాల రాయితీల నగదును నేరుగా వారి ఖాతాలకే బదిలీ చేస్తారు. దీని గురించి శ్రీవాస్తవను ప్రశ్నించగా, సంబంధితశాఖ నుంచి వివరాలు అందిన తరువాతే స్పందిస్తానని చెప్పారు. అన్నశ్రీ యోజన ఖాతా నిధులు ఈ నెలాఖరు వరకే ఉంటాయని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. ‘ఆర్థికపరమైన పథకం అమలుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. కాబట్టి అన్నశ్రీ అమలు గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. ఎల్జీ దీనిపై సమీక్ష నిర్వహించిన తరువాతే నిర్ణయం తీసుకుంటారు’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వాళ్లు అన్నశ్రీ పథకానికి అర్హులవుతారు. దీనికింద ఒక్కో కుటుంబానికి నెలకు రూ.600 చొప్పున రాయితీ నగదును వారి ఖాతాల్లో జమ చేస్తారు.
 
 ప్రస్తుతానికి సర్కిల్‌రేట్లు యథాతథం
 సర్కిల్ రేట్లను ఈ నెలాఖరు వరకు పెంచాలన్న ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కనపెట్టినట్టు సమాచారం. ఢిల్లీలో ఎన్నికలు ముగిసినప్పటికీ, అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యాకే రేట్ల పెంపును పరిశీలించాలని ఎల్జీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దు చేసినా, కొన్ని రాష్ట్రాల్లో ఇది వచ్చే నెల 31 వరకు అమల్లో ఉంటుంది. సవరణ తరువాత సర్కిల్ రేట్లు 20 నుంచి 60 శాతం పెరగవచ్చని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఢిల్లీలో స్థిరాస్తుల విషయంలో ప్రభుత్వ రేట్లకు, మార్కెట్ రేట్లకు మధ్య భారీ తేడా ఉంది. ఈ తేడాను తొలగించడానికి సర్కిల్ రేట్లను సవరించాలని రెవెన్యూశాఖ భావిస్తోంది.  ఒక స్థలాన్ని రిజిస్టర్ చేయడానికి ప్రభుత్వం ప్రాంతాల వారీగా నిర్ణయించే కనీస ధరను సర్కిల్ రేటు అంటారు.
 
 ఉదాహరణకు కేటగిరీ ‘ఎ’ కిందకు వచ్చే జోర్‌బాగ్, గోల్ఫ్‌లింక్స్ వంటి సంప్నన్న కాలనీలు, డిఫెన్స్ కాలనీ వంటి ‘బి’ కేటగిరీ కాలనీల్లో సర్కిల్ రేటు చదరపు కిలోమీటరుకు 6.5 లక్షల రూపాయలు ఉంది. పంజాబీబాగ్ వంటి ‘సి’ కేటగిరీ కాలనీల్లో సర్కిల్ రేటు రూ.1.32 లక్షలు ఉంది. ‘హెచ్’ కేటగిరీ కాలనీలో సర్కిల్ రేటు చదరపు కిలోమీటరుకు రూ.19,400గా ఉంది. ప్రభుత్వం నిర్ణయించే ఈ కనీస ధరకన్నా మార్కెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే రిజిస్ట్రేషన్ సమయంలో చూపించే ధరలకు వాస్తవ ధరలకు ఎంతో తేడా ఉంటుంది. నల్లధనం రూపేణా జరిగే ఈ లావాదేవీల కారణంగా ప్రభుత్వం భారీ ఆదాయాన్ని కోల్పోతోంది. సంపన్న కాలనీకు సంబంధించి తేడా అధికంగా ఉండడం వల్ల వాటి సర్కిల్‌రేట్లు భారీగా పెంచనున్నారు. ఎన్నికలయ్యాకే దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement