న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ విద్యార్థి నిడో తానియా హత్య కేసులో నిందితులపై ఎస్‌సీ, ఎస్టీ చట్టం కింద మోపిన అభియోగాలను ఉపసంహరించాలంటూ దిగువకోర్టు ఇచ్చిన సవాలుచేస్తూ మృతుడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్ పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం శుక్రవారం సీబీఐకి ఓ నోటీసు జారీచేసింది. హతుడి తండ్రి, అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ్యుడు నిడో పవిత్ర ఈ పిటిషన్‌ను దాఖలుచేసిన సంగతి విదితమే. దీనిని పరిశీలించిన జస్టిస్ మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం... ఏప్రిల్ 22వ తేదీలోగా ఇందుకు స్పందించాలంటూ సీబీఐ, తీహార్ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌లతోపాటు నలుగురు నిందితులను ఆదేశించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫర్మాన్... తీహార్ కేంద్ర కారాగారంలో ఉండడంతో సూపరింటెండెంట్‌కు కూడా నోటీసు జారీచేసింది. ఫర్మాన్‌కు బెయిల్ మంజూరు కాలేదు. కాగా దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లోగల ఓ దుకాణదారుడికి, నిడోతానియా మధ్య ఘర్షణ జరిగింది. నిందితులు ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన నిడో తానియా మరణించాడు. ఈ ఘటనపై జాతీయ రాజధానిలో నివసిస్తున్న ఈశాన్య ప్రాంతవాసులనుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
యువకుడిని కాపాడడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ కేసును విచారించిన స్థానిక న్యాయస్థానం నిందితులపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మోపిన అభియోగాలను ఉపసంహరిస్తూ గత ఏడాది సెప్టెంబర్, 25వ తేదీన తీర్పు వెలువరించింది. జాతివివక్ష కేసని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తీర్పు సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. నిడో తానియా ఏ కులానికి చెందినవాడనే విషయం నిందితులకు తెలియదని పేర్కొంది.
నిడో తానియా కేసులో సీబీఐకి హైకోర్టు నోటీసు
Published Fri, Jan 9 2015 10:47 PM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM
Advertisement