
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు సత్కారం చేయాలనే ప్రతిపాదనను ఎట్టకేలకు బీఎంసీ విరమించుకుంది.
సాక్షి, ముంబై: ప్రముఖ మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు సత్కారం చేయాలనే ప్రతిపాదనను ఎట్టకేలకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విరమించుకుంది. గత తొమ్మిదేళ్ల నుంచి సన్మానం పొందడానికి సచిన్‌కు సమయం అనుకూలించకపోవడంతో చివరకు రద్దు చేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో సచిన్ వివిధ క్రికెట్ మ్యాచ్‌లలో ప్రదర్శించిన ప్రతిభకు గుర్తుగా ఆయనకు ముంబై నగరం తరఫున ఘనంగా సత్కరించాలని 2010లో జరిగిన బీఎంసీ సభాగృహంలో నిర్ణయం తీసుకుంది. దీంతో తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని అందుకు సంబంధించిన లేఖను బీఎంసీ అధికారులు ఆయనకు పంపించారు.
కానీ, తరుచూ ఆయన బిజీగా ఉండటంవల్ల వాయిదా వేస్తూ వస్తున్నారు. పలుమార్లు లేఖ రాసి మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఆయన నుంచి స్పందన రాలేదు. తొమ్మిదేళ్లు కావస్తున్నప్పటికీ బీఎంసీ తరఫున సత్కారం పొందేందుకు ఆయనకు సమయం లభించలేదు. చివరకు బీఎంసీ పరిపాలన విభాగం సత్కార కార్యక్రమాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.