నోకియా మూసివేత | Nokia shut down Tamil Nadu cellphone plant, 8000 workers | Sakshi
Sakshi News home page

నోకియా మూసివేత

Published Sun, Nov 2 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

నోకియా మూసివేత

నోకియా మూసివేత

 ‘కనెక్టింగ్ ద పీపుల్’ అనే నినాదంతో వచ్చిన నోకియా డిస్కనెక్టింగ్ ద ఎంప్లాయిస్‌గా వ్యవహరించింది. నోకియా తమిళనాడు విభాగంలో పనిచేస్తున్న 20 వేల మంది జీవితాలను రోడ్డుపాలు చేయడం ద్వారా తానిచ్చిన నినాదానికి విరుద్ధంగా వ్యవహరించింది. విధులకు హాజర య్యేందుకు శనివారం యథావిధిగా పరిశ్రమ వద్దకు వచ్చిన ఉద్యోగులను వెళ్లిపొమ్మంది.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి : ముంబై తరువాత పారిశ్రామిక ప్రగతికి నోచుకుంటున్న తమిళనాడు ఫిన్‌లాండ్ దేశానికి చెందిన నోకియా సంస్థకు సైతం ఆహ్వానం పలికింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు 2006లో 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో నగర శివార్లలోని శ్రీపెరంబుదూర్‌లో పరిశ్రమను స్థాపించింది. ఈ పరిశ్రమలో శాశ్వత ప్రాతిపదిక కింద  8 వేల మంది ఉద్యోగులను, కార్మికులను చేర్చుకుంది. ఇదే విభాగంపై పరోక్షంగా ఆధారపడి మరో 12 వేల మంది జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్లపాటూ లాభాలబాటలో నడిచిన చెన్నై నోకియా భారీగా పన్నుల బకాయిలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గత ఏడాది ఆకస్మికంగా నోకియా లెక్కలు తనిఖీ చేసి వివిధ పన్నుల రూపేణా రూ.2,400 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీచేశారు. అలాగే ఒక కేసు కింద రూ.3,500 కోట్లు చెల్లించాలని మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది. ఒక్క చెన్నైలోని పరిశ్రమకేగాక అన్నిచోట్ల నష్టాలబాట పట్టిందో ఏమో నోకియా యాజమాన్యం అమ్మకానికి పెట్టింది.
 
 ప్రసిద్ధ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ వారు నోకియాను అంతర్జాతీయ స్థాయిలో అన్ని యూనిట్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. భారీ లాభాల బాటలో పయనిస్తున్న మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడం వల్ల తమ బతుకులు మరింతగా వెలిగిపోతాయని చెన్నై యూనిట్ ఉద్యోగులు, కార్మికులు సంబరపడిపోయారు. ఈ క్రమంలో చెన్నై యూనిట్ వివాదాల్లో కూరుకుపోయినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ కనుగొంది. ఈ ఏడాది ప్రథమార్థంలో నోకియా సంస్థ కొనుగోలు ఒప్పందం చేసుకునే సమయంలో చెన్నై యూనిట్‌ను నిరాకరించింది. అన్ని నోకియా యూనిట్లు మైక్రోసాఫ్ట్‌లో విలీనమైపోగా, శ్రీపెరంబుదూర్‌లోని యూనిట్ మిగిలిపోవడంతో నవంబరు 1న మూసివేస్తున్నట్లు యాజమాన్యం మూడు నెలల క్రితం ప్రకటించింది. తమ గతేంటని ఆందోళనకు దిగిన ఉద్యోగ, కార్మిక సంఘాలతో నోకియా యాజమాన్యం చర్చలు ప్రారంభించింది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందిన వారికి పెద్ద మొత్తాలు ఇస్తామంటూ ఆశచూపింది.
 
 రిటైరైనపుడు దక్కే మొత్తానికి అదనంగా రూ.2లక్షలు కలిపి చెల్లిస్తామని నమ్మబలికింది. ఈ నిర్ణయాన్ని కొందరు అంగీకరించగా, మరికొందరు వ్యతిరేకించారు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అడపాదడపా చర్చలు సాగుతుండగానే మూసివేత గడువు ముంచుకు రావడంతో శనివారం యూనిట్ ప్రధాన గేటుకు తాళాలు వేసింది. చర్చలు సాగుతున్నాయి కదా అని యథాప్రకారం ఉదయాన్నే విధుల్లోకి వచ్చిన ఉద్యోగులు తాళం వేసి ఉన్న గేట్లు చూసి విస్తుపోయారు. ఉద్యోగులు, కార్మికులు జొరబడకుండా ఒక డీఎస్పీ, 5 మంది ఇన్‌స్పెక్టర్లు, 50 మంది కానిస్టేబుళ్లతో యాజమాన్యం భారీ పోలీస్ బందోబస్తును సిద్దం చేసింది. ఇక చేసేదిలేక సంస్థ ముందు కొద్ది సేపు నినాదాలు చేసి, ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వమే ఇక్కడి నోకియా యూనిట్‌ను స్వాధీనం చేసుకుని ‘అమ్మ సెల్‌ఫోన్’ను ఉత్పత్తి చేయవచ్చు కదా అని ఓ వామపక్షనేత చమత్కరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement