శాసన మండలికి ప్రభుత్వం ఐదుగురిని నామినేట్ చేసే వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలో హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా వెళ్లింది.
శాసన మండలికి ప్రభుత్వం ఐదుగురిని నామినేట్ చేసే వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలో హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన ఐదుగురిని నామినేట్ చేయడం ద్వారా ఎగువ సభకు పంపడం ఆనవాయితీ. దీనిపై తనకు అందే సిఫార్సులను గవర్నర్ ఆమోదిస్తారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వ్యక్తుల్లో రాజకీయ నేపథ్యం ఉన్న వారుంటే తిరస్కరించే అధికారం ఆయనకు ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ కూడా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో నియమితులయ్యారు. ఈ నెల 20న ఐదుగురు నామినేటెడ్ సభ్యులు రిటైర్ కానున్నారు. వారి స్థానంలో వీఎస్. ఉగ్రప్ప, సినీ నటి జయమాల, ఇక్బాల్ అహ్మద్ సరడగి, శాంత కుమార్‌లతో పాటు అబ్దుల్ జబ్బార్ పేర్లను సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్‌కు జాబితాను పంపారు. వీరిలో ఉగ్రప్ప కాంగ్రెస్ నాయకుడు. గతంలో ఎగువ సభలోనే ప్రతిపక్ష నాయకుడుగా వ్యవహరించారు.
సరడగి కూడా కాంగ్రెస్ మాజీ ఎంపీ. రెండేళ్ల కిందట శాసన సభ నుంచి ఎగువ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. శాంత కుమార్ కాంగ్రెస్ కార్మిక విభాగం నాయకుడు. అబ్దుల్ జబ్బార్ దావణగెరె జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా పని చేశారు. జయమాల లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. సాధారణంగా కళలు, సాహిత్యం, సినిమా, విద్య, వైద్య తదితర రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎగువ సభకు సిఫార్సు చేయడం ఆనవాయితీ. ప్రస్తుతం రాజకీయ నేపథ్యం ఉన్న వారిని ఎంపిక చేయడంలోని ఔచిత్యాన్ని బీజేపీ ప్రశ్నిస్తోంది. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే గవర్నర్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్ప మాజీ మంత్రి వీ. సోమన్నను ఎగువ సభకు సిఫార్సు చేశారు. అంతకు ముందే ఆయన శాసన సభ ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే సోమన్నకు పలు విద్యా సంస్థలున్నందున, విద్యా రంగం కోటా కింద ఆయనను ఎంపిక చేయాలన్న సిఫార్సును గవర్నర్ తోసిపుచ్చారు. ఇప్పుడు బీజేపీ ఆ విషయాన్ని గుర్తుకు తెస్తోంది. ఈ నెల 29న గవర్నర్ రిటైర్ కానున్నారు. ఆలోగా జాబితాపై ఆమోద ముద్ర వేయించుకోవాలని ముఖ్యమంత్రి ఆత్రుతగా ఉన్నారు. అయితే గతంలో సోమన్నను కాదన్న గవర్నర్ ఇప్పుడు ఎలా వ్యవహరిస్తానే విషయమై ఆసక్తి నెలకొంది.
హోం శాఖకు ఫిర్యాదు
ఈ జాబితాను తిరస్కరించాలని గవర్నర్‌కు సూచించాల్సిందిగా కేంద్ర హోం మంత్రికి ప్రతిపక్ష బీజేపీ లేఖ రాసింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి రాసిన ఈ లేఖలో, రాజకీయ పార్టీకి చెందిన వారిని ఎగువ సభకు సిఫార్సు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం సిఫార్సు చేసిన అయిదు మందీ చురుకైన కాంగ్రెస్ నాయకులని తెలిపారు. తద్వారా సమాజంలో కళలు, సైన్స్, సాహిత్యం రంగాల్లోని వ్యక్తులకు ప్రజా సేవ చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు.