హెల్మెట్లు ఎవరు ధరించాలో మేమెలా చెబుతాం?
Published Wed, Jan 22 2014 11:39 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించడాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. వాహనం నడిపే వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడాన్ని తప్పని సరి చేయాలని పిటిషనర్ కోరడంపై ప్రధాన న్యాయమూర్తులు ఎన్‌వీ రమణ, రాజీవ్ సహాయ్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం స్పందించింది. ‘హెల్మెట్లు ఎవరు ధరించాలో మేమెలా చెబుతాం.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించి, మహిళలు కూడా ధరించేలా అమలు చేయాలి.
ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకునేందుకు ఇక్కడ మేం లేమ’ని చెబుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది జుబేదా బేగమ్ మాట్లాడుతూ.. ‘సమాజంలోని కొన్ని సామాజిక వర్గాల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ మోటారు వాహనాల చట్టాన్ని సవరించలేకపోతున్నామ’న్నారు. కాగా ఈ పిటిషన్‌ను ఉల్హాస్ అనే వ్యక్తి దాఖలు చేశాడు. న్యాయవాది ఆర్‌కే కపూర్, ఉల్హాస్ తరఫున వాదిస్తూ... ఢిల్లీ మోటారు వాహనాల చట్టం, 1993ను సవరించాలని, అందరికీ ఒకరకమైన విధివిధానాలు ఉండేలా చూడాలని, లింగభేదం లేకుండా అందరూ హెల్మెట్లు ధరించేలా ఆదేశించాలని కోరారు. గతంలో కూడా మహిళలు హెల్మెట్లు ధరించడాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని కొట్టివేసిన హైకోర్టు తాజాగా దాఖలైన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది.
Advertisement