ముఖ్యమంత్రిని పరుగులు పెట్టిస్తున్న ధరలు
Published Thu, Oct 24 2013 10:30 PM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
న్యూఢిల్లీ:పొట్టిగా ఉండే ఉల్లి షీలా పుట్టి ముంచుతుందా? ఆమె కలవరపడుతున్న తీరు చూస్తుంటే ఎవరికైనా ఇదే భావన కలుగుతుంది. గతంలో ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కూడా ఉన్న ఉల్లి సరిగ్గా ఢిల్లీ విధానసభ ఎన్నికలకు ఆరు వారాల ముందే ఉల్లి ఘాటెక్కుతుండడంతో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా కలవరపడుతోంది. వీలైనంత త్వరగా ఉల్లి ధరలను నేలపైకి తెచ్చేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే షీలాదీక్షిత్ గురువారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్, ఆహారశాఖ మంత్రి కేవీ థామస్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంగీకరించారు. ఉల్లిధరను తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
నగరంలో ఉల్లి ధరను నియంత్రించడం కోసం లాభనష్టాలతో ప్రమేయం లేకుండా ఢిల్లీవాసులకు అవసరమైనంత ఉల్లిపాయలను అందించవలసిందిగా నాఫెడ్‌ను ఆదేశించాలని కేంద్ర మంత్రులను కోరినట్లు ఆమె చెప్పారు. ఉల్లిని మొబైల్ వ్యాన్ల ద్వారా మళ్లీ విక్రయించడానికి అనుమతి ఇవ్వాలని ఢిల్లీ సర్కారు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయనుందన్నారు. గతంలో కూడా ఉల్లిని నగరంలో పలుచోట్ల మొబైల్ వ్యాన్ల ద్వారా విక్రయించామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడం వల్ల నిలిపివేసిన ఈ ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టడానికి అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయనున్నట్లు ఆమె చెప్పారు.
రాజధానికి ఉల్లి సరఫరా మెరుగుపరచడ్డం కోసం రాష్ట్ర అధికారుల బృందాన్ని మహారాష్ట్రకు పంపినట్లు చెప్పారు. అధికారులు నాసిక్ చేరుకున్నారని, నాసిక్, కొల్హాపుర్ నుంచి దాదాపు 1000 టన్నుల ఉల్లి త్వరలో ఢిల్లీకి రానుందన్నారు. పుణేలో ఉల్లి ధరకిలో 40 రూపాయలు ఉందన్న సంగతి తెలిసిం దని, అధికారులు అక్కడికి కూడా వెళ్తారని ఆమె చెప్పారు. ఈ విషయమై తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాచ్ చవాన్‌తో కూడా మాట్లాడానన్నారు. ఈ విషయంలో ఢిల్లీకి వీలైనంత సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని షీలాదీక్షిత్ చెప్పారు. ఉల్లిపండే ప్రాంతాల్లో భారీ వర్షాల కార ణంగా పంట దెబ్బతిందని, సరఫరా తగ్గడంతో ధరలు పెరిగాయన్నారు. రానున్న రోజుల్లో రాజధానిలో ఉల్లి ధర తగ్గుతుందని ఆమె భరోసా ఇచ్చారు. ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని ఉల్లిని అక్రమం గా నిల్వ చేయరాదని వ్యాపారులను కోరారు. పరిస్థితిని అవకాశంగా తీసుకోరాదంటూ హెచ్చరించారు.
ప్రతిపక్షాల ఎద్దేవా...
ఉల్లి ధరలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్షాలు అపహాస్యం చేశాయి. ఈ విషయంలో బహిరంగ చర్చకు రావాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్ విసిరిన సవాలు గురించి అడిగిన ప్రశ్నకు ఆమె జవాబు ఇవ్వడానికి నిరాకరించారు. ఉల్లిధరలను తగ్గించే విషయమై షీలాదీక్షిత్ కేంద్ర మంత్రిని కలవడాన్ని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఓ నాటకంగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లిని విక్రయించడానికి షీలాదీక్షిత్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ ఎద్దేవా చేశారు.
ఎన్నికల కమిషన్ అనుమతిస్తుందా లేదా అన్నది ముఖ్యం కాదని, మొబైల్ వ్యాన్లలో ఉల్లిని అమ్మితే కొనుక్కోవడానికి ప్రజలు దరియాగంజ్ వరకు రావాలా? అని ప్రశ్నించారు. ఇదంతా ప్రజల కంట్లో దుమ్ముకొట్టే వ్యవహారంగా ఆయన అభివర్ణించారు. ఉల్లి ధర షీలాను కంటతడి పెట్టిస్తోందని ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ నితిన్ గడ్కరీ విమర్శించారు. ఉల్లి ధరలను నియంత్రిచలేకపోయిన కాంగ్రెస్‌కు అధికారంలో కొనసాగే హక్కులేదన్నారు. ఉల్లిపాయలు ఢిల్లీలో బీజేపీ సర్కారు కొంపముంచాయని, ఆ తరువాత బీజేపీ అధికారంలోకి రాలేకపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ కొంప ముంచుతాయని జేడీయూ ఎంపీ కేసీ త్యాగి విమర్శించారు.
Advertisement
Advertisement