మహిళా సభ్యుల సంఖ్య అంతే..
Published Mon, Dec 9 2013 12:26 AM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM
సాక్షి, న్యూఢిల్లీ:మహిళలకు టికెట్లు ఇవ్వడంలో రాజకీయ పార్టీలు పిసినారితనాన్ని ప్రదర్శిస్తే వారికి ఓటు వేయడంలో ఓటర్లు సైతం పిసినారితనాన్ని పాటించారు. ఢిల్లీ విధాన సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు మొత్తం 17 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా ముగ్గురిని మాత్రమే ఓటర్లు గెలిపించారు. దాంతో ఈ విధాన సభలోనూ మహిళా ఎమ్మెల్యేల సంఖ్య మూడుకే పరిమితమైంది. ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరుగురు, బీజేపీ తరఫున ఐదుగురు, ఆప్ తరఫున ఆరుగురు నిలుచున్నసంగతి తెలిసిందే. వీరిలో ఆప్ తరఫున పోటీచేసిన ముగ్గురు మాత్రమే గెలిపొందారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తో పాటు మంత్రి కిరణ్ వాలియా.
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్ఖాసింగ్ పరాజయంతో గత అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న ముగ్గురు మహిళలూ ఓటమి పాలైనట్లయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా మహిళా అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. పటేల్‌నగర్‌లో ఆప్‌కు చెందిన వీణా ఆనంద్ బీజేపీకి చెందిన పూర్ణిమా విద్యార్థిని ఓడించారు. బందనా కుమారి షాలిమార్ బాగ్ నుంచి, రాఖీ బిర్లా మంగోల్‌పురిలో గెలిచారు. రాఖీ బిర్లా మంగోల్‌పురిలో మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్‌ను ఓడించగా, మరో మహిళా అభ్యర్థి ఫర్హానా అంజుమ్ మంత్రి హరూన్ యూసఫ్ చేతిలో ఓడిపోయారు. మాలవీయ నగర్, ఆర్‌కేపురంలో కూడా మహిళలు ప్రధాన పార్టీల తరఫున పోటీపడినప్పటికీ వారు ఓడిపోయారు. మాలవీయనగర్‌లో పోటీపడిన కాంగ్రెస్, బీజేపీల తరఫున పోటీపడిన మహిళా నేతలు కిరణ్ వాలియా,
ఆర్తీ మెహ్రా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతి చేతిలో ఓడిపోయారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో జరిగిన ముక్కోణపు పోటీలో షీలాదీక్షిత్ అర్వింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు. తిలక్‌నగర్‌లో డూసూ మాజీ అధ్యక్షురాలు అమతాధవన్ మూడవ స్థానంలో నిలిచారు. డూసూ అధ్యక్షురాలు రాగిణీనాయక్ జనక్‌పురిలో బిజెపి దిగ్గజం జగ్‌దీశ్‌ముఖి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆమె కూడా మూడవ స్థానంలో నిలిచారు. రాజోరీ గార్డెన్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి ధన్వంతీ చందీలా ఓటమి చెందారు. బీజేపీ తరఫున పోటీచేసిన ఇతర మహిళల విషయానికి వస్తే కస్తూర్బానగర్‌లో ఆప్ అభ్యర్థి మదన్‌లాల్ చేతిలో శిఖారాయ్ ఓడిపోయారు. ఎమ్సీడీ మాజీ మేయర్ రజనీ అబ్బీ తిమార్‌పుర్‌లో ఆప్ అభ్యర్థి హరీష్ ఖన్నా చేతిలో ఓడిపోయారు. సుల్తాన్‌పురి మాజ్రా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన సుశీలా కుమారి నాలుగవ స్థానంలో నిలిచారు.
Advertisement